కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ నటీనటుల సందడి ఇంతా అంతా కాదు! దీపికా పదుకునే, తమన్నా, పూజా హెగ్డే, ఊర్వశీ రౌతేలా వంటి అందాల భామలు ఇండియన్ పెవిలియన్ ప్రారంభోత్సవంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తాను తొలిసారి పాల్గొన్నానని చెప్పిన తమన్నా… ఆ అవకాశం తనకు కల్పించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు ధన్యవాదాలు తెలిపింది. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా మూవీ స్టామినా ఏమిటనేది ప్రపంచానికి తెలిసిందని, ఆ చిత్రంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చెప్పింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనాలనే కల ఈ రోజు నిజం కావడం సంతోషంగా ఉందన్నది పూజా హెగ్డే.

తాను బ్రాండ్ తో రాలేదని, బ్రాండ్ ఇండియాతో వచ్చానని, భారత దేశ ప్రతినిధిగా కాన్స్ కు హాజరుకావడం గర్వంగా ఉందని తెలిపింది. పదిహేనేళ్ళ క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పుడు తన ప్రతిభను ఎవరూ గుర్తించలేదని, అయితే కృషి, పట్టుదలతో ఈ రంగంలో నిలదొక్కుకోవడమే కాకుండా ఇవాళ కాన్స్ జ్యూరీలో సభ్యురాలిగా ఉండటం ఆనందాన్ని కలిగిస్తోందని దీపికా పదుకునే చెప్పింది.

ఇండియన్ పెవిలియన్ ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ, ’75 సంవత్సరాల కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతదేశం ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో సరైన భాగస్వామ్యం దక్కింద’ని అన్నారు. ఈ ప్రయాణం మరింత ఫలప్రదంగా ముందుకు సాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ దగ్గర కేవలం సినిమా ఇండస్ట్రీ మాత్రమే లేదని సినీ’మా’ ఉందని అన్నారు. అలానే ఇండియన్ పెవిలియన్ ను సందర్శించిన ప్రతి ఒక్కరూ మనసులో ‘ముగాంబా ఖుష్ హువా’ అని అనుకుంటారని చెప్పారు. హిందీ సినిమాల్లోని పాపులర్ డైలాగ్స్ కేంద్రమంత్రి నోటి నుండి రాగానే కార్యక్రమంలో పాల్గొన్నవారు కరతాళ ధ్వనులు చేశారు. కమల్ హాసన్, ఎ. ఆర్. రెహమాన్ తో పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నటుడు మాధవన్, నవాజుద్దీన్ సిద్ధికి, దర్శకుడు శేఖర్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై 2022 నవంబర్ 20 నుండి 28 వరకూ గోవాలో జరుగబోతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పోస్టర్ ను ఆవిష్కరించారు.