అటు తమిళం ఇటు తెలుగులో హాట్ టాపిక్ లోకేశ్ కనకరాజ్. కమల్ హాసన్ తో లోకేష్ తీసిన ‘విక్రమ్’ సినిమా అఖండ విజయం సాధించింది. కమల్ కున్ను అప్పులన్నింటినీ తీర్చిన సినిమాగా ‘విక్రమ్’ నిలిచింది. సందీప్ కిషన్ తో తీసిన ‘మానగరం’, ఆ తర్వాత కార్తీతో ‘ఖైదీ’, విజయ్ తో ‘మాస్టర్’ సినిమాలు సైతం లోకేష్ ప్రతిభకు పట్టం కట్టాయి. ఇప్పుడు ‘విక్రమ్’తో అపజయం ఎరుగని దర్శకుల ఖాతాలో చేరిపోయాడు లోకేష్. దాంతో టాలీవుడ్ లో లోకేష్ ఎంట్రీ గురించి కథనాలు వెలువడుతున్నాయి.
గతంలో ప్రభాస్‌కు కథ చెప్పాడనే రూమర్ వచ్చింది. దాని సంగతి ఏమో కానీ తాజాగా అల్లు అర్జున్ తో లోకేష్ కనగరాజ్ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప2’ పూర్తి కాగానే లోకేష్ సినిమానే బన్నీ పట్టాలెక్కించబోతున్నాడట. లింగుస్వామి, బోయపాటి వంటి దర్శకులతో అల్లు అర్జున్ సినిమాలు చేస్తాడనే వార్తలు వచ్చినప్పటికీ అవేవీ వాస్తవరూపం దాల్చలేదు. ప్రశాంత్ నీల్ తోనూ జట్టుకట్టబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇలా హిట్ కొట్టిన ప్రతి డైరెక్టర్ తో లింక్ అయి న్యూస్ రావటం చూస్తూనే ఉన్నాం. ఇక ‘విక్రమ్’తో హిట్ కొట్టిన లోకేష్ కి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కమల్ తో కలసి చిరంజీవిని కలిశాడు లోకేష్. అప్పుడు రామ్ చరణ్ ని డైరెక్ట్ చేమని చిరు ఆఫర్ ఇచ్చినట్లు కూడా రూమర్స్ వచ్చాయి. మరి లోకేష్ తన తదుపరి సినిమాను ఏ హీరోతో చేస్తాడనే విషయం తేలాల్సి ఉంది.