అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి కుమారుడు సుమంత్. అక్కినేని చిన్నకూతురు నాగ సుశీల తనయుడు సుశాంత్. వీరిద్దరూ కాస్తంత గ్యాప్ తో టాలీవుడ్ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ గ్రాండ్ సక్సెస్ లు మాత్రం ఇంతవరకూ దక్కలేదు. ఒకానొక సమయంలో సుమంత్ దూకుడుగా సినిమాలు చేశాడు. ఇప్పుడు నిదానించాడు. ఇక సుశాంత్ మొదటి నుండి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. విశేషం ఏమంటే సోలో హీరోలుగా సినిమాలు చేస్తున్న ఈ అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ వైపు దారి మళ్ళారు. నిజానికి సుశాంత్ ఈ పని రెండేళ్ళ క్రితమే ‘అల వైకుంఠపురములో’ మూవీతో చేశాడు. అల్లు అర్జున్ నటించిన ఆ సినిమాలో సుశాంత్ ఓ కీలక పాత్రను పోషించాడు. ఇప్పుడు కూడా రవితేజ ‘రావణాసుర’ మూవీలో రామ్ అనే కీ-రోల్ చేస్తున్నాడు సుశాంత్. ఇక అతని పెద్దమ్మ కొడుకు సుమంత్ అయితే… కెరీర్ లోనే తొలిసారి ‘సీతారామం’ మూవీలో సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాడు.
ఈ పాత్ర గురించి సుమంత్ మాట్లాడుతూ, ‘హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ స్క్రిప్ట్ తనకు బాగా నచ్చిందని, అన్ని పాత్రలకూ ఇందులో ఎంతో ప్రాధాన్యముందని, తాను పోషిస్తున్న బ్రిగేడియర్ విష్ణుశర్మ పాత్ర కూడా అందులో ఒకట’ని అన్నాడు. అప్పుడెప్పుడో సీతారాముల కథతో రూపుదిద్దుకున్న ‘గోదావరి’ మూవీలో తాను హీరోగా నటించానని, ఇప్పుడీ ‘సీతారామం’లో కీలక పాత్ర పోషిస్తున్నానని చెప్పాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమంత్ హీరోగా నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్థంగా ఉండగా, మరో రెండు సినిమాలు సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. అటువంటి సమయంలో సుమంత్ ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్ చేయడానికి ముందుకు రావడం విశేషమే. అలానే సుశాంత్ కూడా ‘రావణాసుర’ మూవీలో కీలక పాత్ర పోషించడంతో పాటు ‘మా నీళ్ళ ట్యాంక్’ వెబ్ సీరిస్ లో హీరోగా నటిస్తున్నాడు. అది ఈ నెల 15 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది.