అఖండ.. అఖండ.. అఖండ.. బాలయ్య మాస్ జాతర ఎక్కడ విన్నా అఖండ గురించే టాక్. గతేడాది థియేటర్లో రిలీజ్ అయినా ఈ సినిమా ఓటిటీలోను అంతే దూసుకుపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాలయ్య నటనను, థమన్ మ్యూజిక్ ని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఆ పోస్టులను, ట్రెండింగ్ లో ఉన్న అఖండ మావోయి ని చూసి హిందీ ప్రేక్షకులు ఈ సినిమాపై మనసుపారేసుకున్నారు. ఈమద్య కాలంలో సౌత్ సినిమాలు నార్త్ లో మంచి విజయాలను అందుకోవడంతో హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాల వైపు తొంగిచూస్తున్నారు. ఇప్పటికే పుష్ప హిందీలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజాగా బాలీవుడ్ అభిమానులు అఖండ హిందీ వెర్షన్ కావాలని మంకు పట్టు పట్టుకొని కూర్చున్నారు. ‘అఖండ’ సినిమా హిందీ వెర్షన్ ను తీసుకు రావాలి లేదంటే హిందీలో ‘అఖండ’ ను రీమేక్ అయినా చేయాలని చాలా మంది డిమాండ్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏ మేము మాత్రం మనుషులం కదా.. మీరు అనుభవించిన ఆ ఫీల్ ని మేము అనుభవించకూడదా..? అంటూ నెటిజన్స్ మేకర్స్ కి, ఫ్యాన్స్ కి కామెంట్స్ పెడుతున్నారు. బాలయ్య నట విశ్వరూపం చూడాలని మాకు మాత్రం ఉండదా..? అంటూ దీనంగా అడుగుతున్నారు. మరి బాలీవుడ్ అభిమానుల కోసం అఖండ మేకర్స్ ‘అఖండ’ సినిమా హిందీ వెర్షన్ ను తీసుకువస్తారా..? లేదా రీమేక్ ప్లాన్ చేస్తారా..? అనేది చూడాలి.