ఇండియన్ ఐడల్ 12 ముగింపు దశకు వచ్చేసింది. ఆగస్ట్ 15న గ్రాండ్ ఫినాలే ఉండవచ్చని అంటున్నారు. అయితే, ఈ సారి ఎపిసోడ్ లో అతిథులుగా వెటరన్ మ్యూజీషియన్ బప్పీ లహరి, డైరెక్టర్ ఒమంగ్ కుమార్ పాల్గొంటున్నారు. ఇక లెటెస్ట్ ప్రోమోలో మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘మేరీ కామ్’ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీ రూపొందించిన ఒమంగ్ కుమార్… షణ్ముఖని ఆకాశానికి ఎత్తేశాడు! ఆమె సింగింగ్ అద్భుతం అంటూ పొగడ్తలు కురిపించాడు. అంతే కాదు, స్టేజ్ మీద ఓ రాక్ స్టార్ లా పర్ఫామ్ చేసిన తేలుగు తేజానికి తన చిత్రంలో ఆఫర్ కూడా ప్రకటించాడు.
“ఏదో ఒక పాట కాదు… నా సినిమాలో అన్ని పాటలూ నువ్వే పాడబోతున్నావ్…” అంటూ సర్ ప్రైజ్ చేశాడు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్! షణ్ముఖ ప్రియ చిత్రాన్ని కూడా డైరెక్టర్ ఒమంగ్ కుమార్ నిమిషాల వ్యవధిలో పేపర్ పై వేశాడు! ఆ అందమైన పెయింటింగ్ ని తన ఫేవరెట్ సింగర్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు! ఒమంగ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తన ప్రతిభని గుర్తించటం, అభిమానించటం చాలా సంతోషంగా ఉందని షణ్ముఖ అంటోంది… ప్రతీ శని, ఆది వారాల్లో రాత్రి 9.30 గంటలకి సోనీ టీవీలో ప్రసారం అయ్యే ఇండియన్ ఐడల్ ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ తో కొనసాగుతోంది. ఫైనల్ కి చేరే అవకాశం ఉన్న ఆరుగురిలో షణ్ముఖ ప్రియ కూడా ఒకరు…