సినిమా రంగాన్ని నమ్ముకుంటే తప్పకుండా ఆ తల్లి ఆదరిస్తుంది అంటూ ఉంటారు. చిత్రసీమలో విజయం సాధించిన వారందరి మాటా ఇదే! ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ సైతం అదే మాటను పలుకుతూ ఉంటారు. చిత్రసీమలో అడుగు పెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ, చివరకు నిర్మాతల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు బెల్లంకొండ సురేశ్. ఆయన తనయుడు సాయి శ్రీనివాస్ నవతరం హీరోల్లో ఒకరిగా సాగుతున్నారు.
బెల్లంకొండ సురేశ్ 1965 డిసెంబర్ 5న గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆయన కన్నవారికి సైతం కళలంటే ఆసక్తి. అదే సురేశ్ ను చిత్రసీమవైపు ఆకర్షితులయ్యేలా చేసింది. ఆరంభంలో సినిమా రంగంలో దొరికిన ప్రతి పనిని చేసుకుంటూ పోయారు. తరువాత కొంతమందితో కలసి చిత్రాలు తీశారు. ఆ పై శ్రీసాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై చిత్రాలు నిర్మించడం ఆరంభించారు. శ్రీహరి హీరోగా ‘సాంబయ్య’ చిత్రం తీస్తూ సోలో నిర్మాతగా మారారు. ఆ సినిమా సాధించిన విజయంతో బెల్లంకొండ సురేశ్ వరుసగా సినిమాలు నిర్మిస్తూ సాగారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ కు దర్శకునిగా తొలి అవకాశం కల్పించింది బెల్లంకొండనే! జూనియర్ యన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ నిర్మించిన ‘ఆది’ బంపర్ హిట్ గా నిలచింది. ఆ తరువాత వినాయక్ డైరెక్షన్ లోనే ‘చెన్నకేశవ రెడ్డి’ తెరకెక్కించి, విజయం సాధించారు. జయంత్ దర్శకత్వంలో ‘లక్ష్మీ నరసింహా’ రూపొందించి, ఘనవిజయాన్ని చేజిక్కించుకున్నారు. శింగనమల రమేశ్ తో కలసి బెల్లంకొండ సురేశ్ రాజశేఖర్ హీరోగా నిర్మించిన ‘మా అన్నయ్య’ సైతం జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
బెల్లంకొండ సురేశ్ కు ఇద్దరు కుమారులు. వారిలో సాయి శ్రీనివాస్ పెద్దవాడు. చిన్నబ్బాయ్ సాయి గణేశ్. సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ బెల్లంకొండ సురేశ్, వినాయక్ దర్శకత్వంలో ‘అల్లుడు శ్రీను’ నిర్మించారు. ఈ చిత్రాన్ని రాజీపడకుండా భారీగా నిర్మించారు సురేశ్. సమంత నాయికగా నటించిన ఈ చిత్రం సాయి శ్రీనివాస్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆయన చిన్న కొడుకు సాయి గణేశ్ కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఆ అబ్బాయిని కూడా త్వరలోనే నటునిగా పరిచయం చేస్తారని వినిపిస్తోంది.