‘అన్‌స్టాపబుల్’ అంటూ బాలకృష్ణ ఆహా లో మొదలెట్టిన టాక్ షో అన్‌స్టాపబుల్ గా కొనసాగుతోంది.. ఎప్పుడు సీరియస్ గా కానించే బాలయ్య ఈ షో లో చిన్నపిల్లాడిలా మారిపోయి అల్లరి చేయడం, వచ్చిన సెలబ్రేటీపై కామెడీ పంచులు విసరడం ఈ షోని ఎక్కడికో తీసుకువెళ్లాయి. బాలయ్య ఏంటీ ..? హోస్ట్ ఏంటీ అన్నవాళ్ళే నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు బాలయ్య అని అడుగుతున్నారు అంటే బాలకృష్ణ ఈ విధంగా ప్రేక్షకులను అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం 4 వ ఎపిసోడ్ ని కూడా అంతే హై వోల్టేజ్ గా ప్లాన్ చేసింది. అఖండ చిత్రంతో అఖండమైన విజయ్‌ని అందుకున్న చిత్ర బృందంతో బాలయ్య అన్‌స్టాపబుల్ లో సందడి చేశారు. ఇక ఈ ప్రోమో ఆద్యంతం బాలయ్య కామెడీ పంచులతో అదిరిపోగా.. చివరన ఒక సెంటిమెంటల్ ఫ్యాక్టర్ ఓపెన్ కావడంతో ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఎన్నడూలేని విధంగా బాలయ్య కంటతడి పెట్టడం అభిమానులను కలిచివేస్తోంది. ఈ ప్రోమోలో అప్పటివరకు సందడి చేసిన బాలయ్య.. తన తండ్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టారు. “వెన్నుపోటు పొడిచారు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. అందరికన్నా ముందు నేను ఆయన కొడుకుల్లో ఒకడిని, అభిమానుల్లో ఒకడిని” అంటూ కట్ చేసిన ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ మాటలు ఆయన చెప్పడానికి గల కారణాలు ఏంటీవి అనేది తెలియాల్సి ఉంది. మొదటి ఎపిసోడ్ లోనే మోహన్ బాబు.. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే నువ్వేం చేశావ్ ..? అని బాహాటంగానే అడిగినా బాలయ్య ఆ సమయంలో వారసత్వ రాజకీయాలు వద్దు అని వదిలేశానని చెప్పుకొచ్చాడు. ఇక ఈరోజు ఆ వెన్నుపోటు గురించిన విషయాలను బాలయ్య ఎందుకు బయటపెట్టాలనుకొంటున్నాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఇక నిజం మాట్లాడుకోవాలంటే అసలు బాలకృష్ణను ఈ అంశాలపై ప్రశ్నించే స్థాయి వాళ్లెవరూ ఈ ఎపిసోడ్ లో పాల్గొనలేదు. మరి అలాంటప్పుడు ఆయన అంత భావోద్వేగం అవ్వాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ అభిమానులు గుసగుసలాడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ వెన్నుపోటు ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుంది.. బాలయ్య నోటినుంచి ఏ నిజాలు బయటపడనున్నాయని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.