ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ కి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో మన స్టార్ హీరోలైన ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు విజయ్ దేవరకొండకూ దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ వచ్చింది. ‘బాహుబలి’ సీరీస్ తో ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తూ వస్తున్నాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రత్యేకించి ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అందులో బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఉండటం విశేషం. ఇక ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ కి సైతం సూపర్ క్రేజ్ వచ్చింది. తాజాగా ‘లైగర్’ విడుదలకు ముందే విజయ్ దేవరకొండకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. ‘లైగర్’ నిర్మాణంలో బాలీవుడ్ నిర్మాతలు భాగస్వాములు కావటంతో విజయ్ అండ్ కో తుపాన్ లా అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. అయితే ఉత్తరాది ప్రాంతాల్లో ‘పుష్ప’ సినిమాను ప్రమోట్ చేయనప్పటికీ అల్లు అర్జున్ సినిమా మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలవటం గమనార్హం.
అందుకేనేమో ఆ క్రేజ్ క్యాష్ చేసుకుంటున్నాడు. ఇటీవల కెఎఫ్ సితో పాటు కోక్ వంటి బ్రాండ్స్ కి బ్రాండ్ ఎంబాసిడర్ గా ఎంపికయ్యాడు. అంతే కాదు ఇంకా పలు బ్రాండ్స్ బన్నీని వెతుక్కుంటూ వస్తున్నాయి. దీనికోసం ముంబైలో ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అల్లు అర్జున్. గతంలో ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పలు బ్రాండ్లకు ప్రమోటర్ గా పని చేసినప్పటికీ ఆ తర్వాత అంత ఇంట్రెస్ట్ చూపించ లేదు.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించటమే కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అద్భుతమైన సక్సెస్ ను పొందింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కీర్తిని సంపాదించారు రామ్ చరణ్, ఎన్టీఆర్. ఆ తర్వాత వీరిద్దరూ ఒకటి రెండు బ్రాండ్స్ లో కనిపించినప్పటికీ ఆ తర్వాత ఎలాంటి సందడి చేయకపోవడం పలువురుని ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ వైపు బన్నీ బ్రాండింగ్ లో దూసుకుపోతుంటే ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ వెనుకబడి ఉండటం వారి అభిమానులను కలవరపెడుతోంది. తాజాగా ఎన్టీఆర్ కి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటనకి గాను ఆస్కార్ ఎంట్రీ లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఇటు ఎన్టీఆర్ కానీ అటు రామ్ చరణ్ గానీ బ్రాండ్స్ విషయంలో బన్నీతో ఎలా పోటీపడతారో చూడాలి.