AP04 Ramapuram: ఎస్. వి. శివారెడ్డి సమర్పణలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన సినిమా ‘ఎ.పి. 04 రామాపురం’. రామ్ జక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్. రాజ్, సునీల్ మల్లెం ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను యు. హేమారెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ మూవీ టైటిల్, మోషన్ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో శనివారం ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. అతిథులుగా బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్, జెస్సీ తో పాటు నటుడు పృథ్వీరాజ్, నందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ”చాలా తక్కువ బడ్జెట్ లో హీరో ఎలివేషన్ సీన్స్ ను దర్శకుడు హేమారెడ్డి చాలా బాగా తీశారు. మోస్ట్ డెడికేటెడ్ టెక్నీషియన్ అతను. డిసెంబర్ 9న సినిమా విడుదల కాబోతోంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. హేమా రెడ్డి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని, అతని కష్టానికి తగిన ప్రతి ఫలాన్ని ఈ సినిమా ఇస్తుందనే నమ్మకం ఉందని జెస్సీ, సోహెల్ చెప్పారు.
నటుడు నందు మాట్లాడుతూ, ”టాలెంట్ ను నమ్మి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ అందరికీ థాంక్యూ. కడప నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అక్కడ ఎలాంటి సపోర్ట్ లభించిందో నాకు తెలియదు. అయినా సినిమాను బాగా చేశారు. అదే ఇక్కడ తీసి ఉంటే ఇంకా బాగా తీసేవాళ్లేమో! ఈ మూవీ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ సినిమా కథను తన 19వ యేట రాయడం మొదలు పెట్టానని, 23 సంవత్సరాలకు డైరెక్షన్ చేశానని దర్శకుడు హేమారెడ్డి తెలిపారు. ఈ సినిమా ప్రచారానికి, విడుదలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. చివరగా నిర్మాత రామ్ రెడ్డి అందూరి మాట్లాడుతూ, ”చిన్న సినిమా, పెద్ద సినిమా అనే బేధభావం చూపకుండా మా చిత్ర బృందాన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మాకున్న పరిమితమైన బడ్జెట్ లో ఈ సినిమాను చేశాం. దీనిని తెలుగు ప్రేక్షకులు ఆదరించాల్సిందిగా కోరుతున్నాం” అని అన్నారు.