అంజలి అచ్చ తెలుగు అమ్మాయే, కానీ రచ్చ గెలిచి ఇచ్ఛతో ఇంటికొచ్చి మెప్పించింది. నటిగా అంజలికి రావలసినంత గుర్తింపు రాలేదని తెలుగు అభిమానుల ఆవేదన. ఈ నాటికీ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి జనాన్ని మెప్పించడంలో మేటి అనిపించుకుంటోంది అంజలి. టాప్ స్టార్స్ సరసన సైతం నటించి అలరించిన అంజలి విలక్షణమైన పాత్రల్లోనూ సలక్షణంగా అభినయిస్తూ సాగుతోంది.
అంజలి 1988 జూన్ 16న తూర్పు గోదావరి జిల్లా రాజోల్ లో జన్మించింది. స్వస్థలంలోనే పాఠశాల విద్య పూర్తి చేసిన అంజలి, మదరాసు వెళ్ళి అక్కడే ఇంటర్మీడియట్, గణితంలో డిగ్రీ చేసింది. కన్నవారి ప్రోత్సాహంతోనే చిత్రసీమలో రాణించాలని ఉవ్విళ్ళూరింది. ఆరంభంలో కొన్ని లఘు చిత్రాల్లోనూ నటించింది. ఓ తమిళ నిర్మాత అంజలి పేరును సుందరిగా మార్చి, కొన్ని సినిమాలను ఆరంభించారు. కానీ, అవేవీ వెలుగు చూడలేదు. 2006లో శివనాగేశ్వరరావు తెరకెక్కించిన ‘ఫొటో’ సినిమాతో తొలిసారి వెండితెరపై తళుక్కుమంది అంజలి. తొలి సినిమాలోనే విలక్షణమైన దెయ్యం పాత్రలో అంజలి అలరించింది. మాతృభాష తెలుగులో అంతగా ఆకట్టుకోలేక పోయిన అంజలి, తమిళంలో తడాఖా చూపించింది. అనేక తమిళ చిత్రాలలో నాయికగా, కీలక పాత్రలు ధరించింది. తరువాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మళ్ళీ తెలుగు తెరపై మెరిసింది అంజలి. ఇందులో వెంకటేశ్ సరసన సందడి చేసిన అంజలికి తరువాత ‘మసాల’లో మరోమారు ఆయనతో జోడీ కట్టే అవకాశం లభించింది. బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’లో మురిపించింది. “బలుపు, గీతాంజలి, శంకరాభరణం, చిత్రాంగద, నిశ్శబ్దం, వకీల్ సాబ్” చిత్రాలలో కీలక పాత్రలో అలరించింది అంజలి.
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించే చిత్రంలో అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. మరో తెలుగు చిత్రంలోనూ, ఓ కన్నడ సినిమాలోనూ అంజలి నటిస్తోంది. ఆమె మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.