ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా 2012లో జూలై 6న విడుదలై విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ‘అందాల రాక్షసి’ మూవీ కూడా విడుదలైంది. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్ర నిర్మాణంలో ఎస్. ఎస్. రాజమౌళి సైతం భాగస్వామిగా వ్యవహరించారు. ఈ సినిమాతో హీరోహీరోయిన్లుగా నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠితో పాటు దర్శకుడిగా హను రాఘవపూడి పరిచయం అయ్యాడు. సో… వీళ్ళందరూ ఆగస్ట్ 10వ తేదీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతోంది. విశేషం ఏమంటే ఈ ముగ్గురు నటులు, దర్శకుడు కూడా ఇంకా ఈ రంగంలో కొనసాగుతున్నారు. ఊహకందని విజయం వీరికి ఇంతవరకూ దక్కకపోయినా… తమదైన ముద్రను వేయడంలో సక్సెస్ సాధించారు. నవీన్ చంద్ర సోలో హీరోగా పెద్ద విజయాన్ని అందుకోలేకపోయాడు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మంచి ఫామ్ లో ఉన్నాడు. రాహుల్ రవీంద్రన్ సైతం సోలో హీరోగా విజయం దక్కకపోవడంతో డైరెక్షన్ వైపు దృష్టి సారించాడు. సుశాంత్ తో ‘చి.ల.సౌ’ మూవీ తీసిన విజయం అందుకున్న రాహుల్ ఆ తర్వాత నాగార్జున తో ‘మన్మథుడు -2’ డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ తో దర్శకుడిగా బిజీగా ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు నటుడిగానూ తన సత్తా చాటుకుంటున్నాడు. అలా ఆ మధ్య ‘శ్యామ్ సింగరాయ్’ మూవీలో ఓ కీలక పాత్రను పోషించాడు.
‘అందాల రాక్షసి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అయోధ్య భామ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తొలి చిత్రం గొప్ప విజయం అందుకోకపోయినా… లావణ్యకు నటిగా మంచి మార్కులే పడ్డాయి. ‘త్వరగా పెళ్ళి చేసేయండి నాన్నా…’ అంటూ ఆమె ముద్దుముద్దుగా చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. గడిచిన పదేళ్ళలో లావణ్య త్రిపాఠి తెలుగులో దాదాపు 16 సినిమాలలో నటించింది. అందులో ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు – శుభమస్తు’ విజయం సాధించాయి. ఆ తర్వాత కూడా ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ లో ఆమెకు ఛాన్స్ వచ్చింది కానీ అవేవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కీలక పాత్రధారణిగా ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ రూపుదిద్దుకుంది. ‘మత్తు వదలారా’ ఫేమ్ రితీశ్ రాణా తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 8న జనం ముందుకు రాబోతోంది. అంటే… ‘అందాల రాక్షసి’ పదేళ్ళు పూర్తిచేసుకోవడానికి దాదాపు నెల రోజుల ముందు అన్నమాట!
‘అందాల రాక్షసి’తో దర్శకుడిగా మారిన హను రాఘవపూడి ఆ తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, నితిన్ ‘లై’, శర్వానంద్ ‘పడిపడిలేచే మనసు’ చిత్రాలను తెరకెక్కించాడు. ఇవేవీ అతనికి గ్రాండ్ సక్సెస్ ను ఇవ్వలేదు. అయితే గుడ్ ఫిల్మ్ మేకర్ గా హను రాఘవపూడికి మంచి పేరైతే వచ్చింది. అందువల్లే ఇప్పుడు స్వప్న సినిమాస్ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా త్రిభాషా చిత్రం ‘సీతారామం’ను తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదల కాబోతోంది. ‘అందాల రాక్షసి’ విడుదలైన పది సంవత్సరాలకు ఐదు రోజుల ముందు అన్నమాట. ఆ రకంగా ఇటు హీరోయిన్, అటు డైరెక్టర్ ఇద్దరి సినిమాలూ వాళ్ళ కెరీర్ ప్రారంభమైన పది సంవత్సరాలకు కొద్ది రోజుల ముందు రావడం విశేషం. మరి ‘హ్యాపీ బర్త్ డే’తో లావణ్య త్రిపాఠి, ‘సీతారామం’తో హను రాఘవపూడి గ్రాండ్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.