‘వయసుతో పనియేముంది…మనసులోనే అంతా ఉందని’ అమ్మాయిలు అంటూ ఉంటారని, అందువల్లే ముద్దుగుమ్మలు ముసలి హీరోలతోనైనా సై అంటూ నటించేస్తుంటారని అందరికీ తెలుసు. కానీ, వారికీ కొన్ని అభిలాషలు ఉంటాయి. అలాగని, తన మనసుకు నచ్చిన హీరోతోనే నటిస్తానని చెప్పడం లేదు కానీ, తమ వయసు అమ్మాయిలతోనే కలసి నటిస్తే భలేగా ఉంటుందని కొందరి అభిప్రాయం. ఇంతకూ ఈ అభిప్రాయం ఎవరిదీ అంటారా? ముద్దుకే ముద్దొచ్చే మందారంలా ఉండే అనన్యా పాండే మనసులోని మాట ఇది! ‘లైగర్’ భామగా తెలుగువారికి గుర్తున్న అనన్యా పాండే ఆ సినిమాతో ఎక్కడికో వెళ్తానని ఆశించింది. కానీ, ఆమె ఆశలను పూరి జగన్నాథ్ ‘లైగర్’ నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు అమ్మాయిగారు తన మనసులోని మరో మాటను బయట పెట్టింది. ఇంతకూ ఏమిటది?
‘గెహ్రాయియా’ చిత్రంలో దీపికా పదుకొణేతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న అనన్య తన వయసు వారైన జాన్వీకపూర్, సారా అలీఖాన్ తో తెర పంచుకోవాలని ఉందని చెబుతోంది. ఎందుకలాగా? రమారమి వయసున్నవారితో కలసి నటించడం కానీ, వారితో కలసి సరదాగా తిరగడం కానీ ఎంతో ఎంజాయ్ కలిగిస్తుందని అంటోది. అంటే ‘గెహ్రాయియా’ సమయంలో దీపికతో ఏదో జరిగిందన్నమాటేగా!? అన్నది బాలీవుడ్ బాబుల అనుమానం. అలాంటిదేమీ లేదని, దీపికాతో కలసి నటించడం ఓ అక్కతో చెల్లి నడచుకున్నట్టుగా ఉంటుందని, అదే సారా, జాన్వీతో అయితే ఫ్రెండ్స్ తో సరదాగా తిరిగినట్టుగా ఉంటుందనీ చెబుతోంది. ‘గెహ్రాయియా’లో నిజంగానే అనన్యకు వరుసకు అక్క అయ్యే పాత్రలోనే దీపిక నటించింది. జాన్వీ, సారాతో కలిస్తే తాను చేసే రచ్చనే వేరుగా ఉంటుందనీ అనన్య అంటోంది. మరి ఈ ముగ్గురినీ కలిపి ఎవరు సినిమా తీస్తారో చూడాలి.