ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ (వెంకటేశ్), సిద్ధు ముద్దతో కలిసి నిర్మించిన సినిమా ‘గని’. గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉన్నా, దానితో సంబంధం లేకుండా ‘అల్లు బాబీ కంపెనీ’ అనే బ్యానర్ లో ‘గని’ సినిమాను ఆయన నిర్మించారు. ఈ చిత్రం జయాపజయాలకు పూర్తి బాధ్యత తనదేనని, అందుకే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశానని బాబీ అన్నారు. తొలిసారి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన తనకు ‘గని’ అన్ని పాఠాలూ నేర్పేసిందని, కరోనా కారణంగా ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నానని బాబీ చెప్పారు. షూటింగ్ ప్రారంభించి తొలి షెడ్యూల్ జరపగానే కరోనాతో బ్రేక్ పడిందని, ఆ సమయంలో వేసిన స్టేడియం సెట్ వృధా అయిపోయిందని, దాంతో మరింత బెటర్ మెంట్ తో మరోసారి సెట్ వేశామని తెలిపారు. వరుణ్ తేజ్ విగరస్ గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భుజానికి గాయం కావడంతోనూ షూటింగ్ లో జాప్యం జరిగిందని చెప్పారు. మొత్తం మీద ఈ చిత్రం గొప్ప అనుభవాన్నే తనకు కల్పించిందని అన్నారు. వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, నవీన్ చంద్రతో పాటు ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఓ కీలక పాత్రను పోషించాడు. అందుకే ఏప్రిల్ 8న తెలుగుతో పాటు కన్నడలోనూ ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేస్తున్నామని చెప్పారు.
నాలుగైదేళ్ళ నాటి ముచ్చట!
‘గని’ సినిమాను నాలుగైదేళ్ళ క్రితమే ప్లాన్ చేశామని, వరుణ్ తేజ్ తో ఉన్న అనుబంధంతో కిరణ్ కొర్రపాటి చెప్పిన స్పోర్ట్స్ డ్రామా పాయింట్ నచ్చి ఓకే చెప్పామని, అక్కడ నుండి అందరి సలహాలు, సంప్రదింపులతో కిరణ్ కథను పూర్తి స్థాయిలో డెవలప్ చేశాడని అన్నారు. అల్లు అరవింద్ కొన్ని సూచనలు చేశారని, ఫైనల్ గా అనుకున్న కథను అనుకున్న విధంగా కిరణ్ తీశాడని, ఇది తాము హానెస్ట్ గా తీసిన సినిమా అని బాబీ చెప్పారు. ఇందులో మూడు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంటాయని, తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ను తెర మీద చూసి ఎంజాయ్ చేయాల్సిందేనని బాబీ అన్నారు. తమకు మెంటర్ గా అల్లు అరవింద్ ఉండటంతో సినిమా నిర్మాణంలో ఏర్పడిన హర్డిల్స్ ను సునాయాసంగా అధిగమించామని తెలిపారు. పాన్ ఇండియా మూవీగా దీనిని తీయాలనే ఆలోచన తమకు మొదట లేదని, ఆ యా పాత్రలకు తగిన నటులను ఎంపిక చేస్తూ వెళ్ళామని, మంచి ఫలితం లభిస్తే ఇతర భాషల్లోనూ విడుదల చేస్తామని అన్నారు.
వరుణ్ సైకలాజికల్ హోమ్ వర్క్!
ఇప్పటి వరకూ బాక్సింగ్ నేపథ్యంలో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చినా, పర్ ఫెక్ట్ ప్రో-బాక్సింగ్ పై ఏ చిత్రమూ రాలేదని, అలా వస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా తమదేనని అన్నారు. కేవలం ఫిజికల్ ఫిట్ నెస్ మీద మాత్రమే దృష్టి పెట్టకుండా సైకలాజికల్ గానూ వరుణ్ తేజ్ బోలెడంత హోమ్ వర్క్ చేశాడని బాబీ కితాబిచ్చాడు. మహమ్మద్ అలీ సినిమాలు చూడటంతో పాటు అతనిపై వచ్చిన పుస్తకాలను చదివాడని, యూఎస్ లోనూ, ఇండియాలోనూ ఒలింపిక్స్ లో పాల్గొన్న బాక్సర్స్ దగ్గర శిక్షణ తీసుకున్నాడని, బాడీ లాంగ్వేజ్ తో పాటు బాక్సర్స్ సైకాలజీని కూడా అర్థం చేసుకుని దానికి తగ్గట్టు నటించాడని చెప్పాడు.
పదిహేనేళ్ళుగా సినిమా అనుబంధ రంగంలో…
అల్లు అరవింద్ తనయుడు అర్జున్ స్టార్ హీరోగా రాణిస్తుంటే, చిన్న కుమారుడు శిరీష్ సైతం హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పెద్దబ్బాయి బాబీ మాత్రం సినిమా రంగానికి ఇంతకాలం దూరంగా ఉన్నాడనే భావన చాలామందిలో ఉంది. దానికి బాబీ ఈ రోజు వివరణ ఇచ్చారు. తాను దాదాపు 15 సంవత్సరాలుగా సినిమా రంగానికే చెందిన వ్యాపారంలో ఉన్నానని, జస్ట్ టిక్కెట్స్ పేరుతో ఆన్ లైన్ టిక్కెటింగ్ కంపెనీని నిర్వహిస్తున్నానని చెప్పారు. అలానే సినిమాలను శాటిలైట్ ద్వారా థియేటర్లకు అందించే క్యూబ్ సంస్థను కూడా తానే నడుపుతున్నానని అన్నారు. ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ నిర్వహణలోనూ బాబీ తలమునకలై ఉన్నారు. విశేషం ఏమంటే… త్వరలో ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ ను ఎఫ్.డి.సి. ద్వారా అందించాలని అనుకుంటోంది. అందుకోసం బిడ్స్ ను ఆహ్వానించింది. దానిలో అల్లు బాబీకి చెందిన జస్ట్ టిక్కెట్స్ సంస్థ కూడా పాల్గొంది. తెలిసిన సమాచారం మేరకు ఇదే సంస్థకు ఆన్ లైన్ టిక్కెటింగ్ బాధ్యతలను ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతోందని తెలుస్తోంది. అయితే అధికారిక సమాచారం వచ్చేవరకూ తాను ఈ విషయంపై స్పందించలేనని బాబీ అన్నారు.