ఏ రంగంలోనైనా వారసత్వం ఉంటుంది. ఇక చిత్ర పరిశ్రమలో వారసత్వం నుంచి వచ్చిన హీరోలే ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరి వారసులు టాలీవుడ్ ని ఏలుతున్నారు. ప్రస్తుతం అందరి చూపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసుడిపైనే ఉన్నాయి. పవన్, రేణు దేశాయ్ లకు పుట్టిన కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతనికి 18 ఏళ్లు. ఆరడుగుల ఆజానుబాహుడు.. సూదంటి చూపులతో మెగా వారసుడు ఇప్పుడే హీరోలా కనిపించేస్తున్నాడు. ఇక అకీరాకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
ఎప్పటి నుంచో పవన్ నట వారసుడి ఎంట్రీ కోసం టాలీవుడ్ ఎదురుచూస్తుంది. ఇక అందరికన్నా పవన్ ఫ్యాన్స్ అకీరా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆ అభిమానం హాద్దు దాటి ఇదుగో ఇలా పోస్టర్ ఎక్కింది. పవన్ ఫ్యాన్స్ అకీరా ను హీరోగా, మారకముందే స్టార్ ని చేసేశారు. అకీరా ఫొటోకు ఇదుగో ఇలా పూల మాలలు వేసి పూజలు చేయడం మొదలుపెట్టేశారు. మెగా వారసుడు అకీరా నందన్ అని పోస్టర్ పై రాసి ఫ్లెక్సీలు వేలాడదీశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే ఫ్యాన్స్ ఇంత హంగామా చేస్తే.. ఇక ఎంట్రీ ఇచ్చాకా ఇంకెంతటి హంగామా చేస్తారో చూడాలి.