పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘లైగర్’ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ చిత్రంలోని “అక్డి పక్డి…” అంటూ సాగే పాట అఫిసియల్ వీడియో సోమవారం (జూలై 11) మధ్యాహ్నం విడుదల చేశారు. ‘లైగర్’ అంటేనే “లయన్ కి, టైగర్ కి క్రాస్ బ్రీడ్…” అని అర్థం! ‘లైగర్’ ట్యాగ్ లైన్ కూడా “సాలా క్రాస్ బ్రీడ్…” అనే ఉంది. ఇక “అక్డి పక్డి..” పాటను సైతం సందడి సందడిగానే చిత్రీకరించారు. పాట మొత్తం హంగామా కనిపిస్తూ ప్రధాన జోడీ విజయ్ దేవరకొండ, అనన్య పాండే సైతం ఆ గుంపులోనే కలసి పోయారు తప్ప, వారిపై ప్రత్యేకంగా కంపోజ్ చేసిన డాన్స్ బిట్స్ ఏవీ ఇందులో కనిపించవు. ఈ పాటను భాస్కరభట్ల రాయగా, మణిశర్మ స్వరకల్పన చేశారు. డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ నేతృత్వంలో ఈ పాట రూపొందింది.
“డిక్కి డిక్కి డికిడి… డికిరో…” అంటూ చిన్నపిల్ల వాయిస్ లో పాట మొదలవుతుంది. తరువాత “నిన్నే చూసి ఓ మై డార్లింగ్… మనసే ఫ్రై ఫ్రై హోగయా…” అంటూ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ ను మిక్సీలో వేసి కలగలిపినట్టు పల్లవి మొదలవుతుంది. ఆపై అవే పదాలతో… “మనసే షై షై హోగయా…” అనీ వినిపిస్తుంది. పాటలో సాహిత్యం ఎలా కలగపులగంగా ఉందో, చిత్రీకరణ కూడా మొత్తం జనాలతో నిండిపోయి ఉంది. ఇక హీరో,హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ భలేగా సాగిందనే చెప్పాలి. వారిద్దరి ముద్దుల పద్దు ఇంత చిన్న వీడియోలోనే హద్దులు దాటింది. మరి మొత్తం పాటలో ఎలా ఉంటుందో తెరపైనే చూడాలి!