Adipurush Success Journey : మరికొద్ది గంటల్లో తెలుగు సహా ఇండియన్ సినీ ప్రేమికుల ముందుకు ఆదిపురుష్ సినిమా వచ్చేస్తోంది. నిజానికి ప్రతి ఒక్కరి మనసులో శ్రీరాముడు రూపం ఒకలా ముద్రించుకుని ఉండగా ప్రభాస్ సరికొత్త రాముడిగా కండలు తిరిగిన విలుకాడిని తలపిస్తూ.. ఆదిపురుష్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాల్మీకి రాసిన రామాయణ కథాంశంతో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్న సినిమానే ఆదిపురుష్. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేయగా బాలీవుడ్ టీ సిరీస్ సంస్థ సుమారు 550 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ.. ఇటీవల తిరుపతిలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ ఆదిపురుష్ మూవీ ట్రైలర్, టీజర్, పోస్టర్స్ విడుదలైన నాటి నుంచి ఏదో ఒక అంశంతో వివాదాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి.
సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు అయితే రకరకాల చర్చలు జరిగాయి రావణుడి లుక్ వింతగా ఉందని ప్రభాస్ పాదరక్షలు మొదలు బట్టల దాకా అనేక విషయాలను తెర మీదకు తెస్తూ వివాదంలోకి నెట్టారు. ఇక ఈమధ్యనే రాముడి రూపంపై చర్చ జరిగింది. మీసాలు లేకుండా దేహం నీలివర్ణంలో ఉంటుందన్న నమ్మకంతో ఉన్నవారిని షాక్ కి గురి చేస్తూ ఆదిపురుష్‌లోని శ్రీరాముని రూపం ఉంది. ఈ క్రమంలో దానిపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం.. శ్రీవారి సన్నిధి ప్రాంగణంలో కృతి సనన్ అండ్ ఓం రౌత్… కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి పనులు కూడా తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
పైపెచ్చు స్వామివారి శేష వస్త్రాలు ధరించి, శ్రీవారి సన్నిధి ప్రాంగణంలో ముద్దు పెట్టుకోవడం ఏంటని భక్తులతో పాటు పలువురు ప్రముఖులు కూడా తూర్పారబట్టారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ ఓం రౌత్ మాట్లాడుతూ ఏ వేదిక మీద అయినా రామాయణం కథ జరుగుతున్నా… హనుమంతుడు అక్కడికి వచ్చి వీక్షిస్తారని.. తన తల్లి చెప్పారని, కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా నడుస్తున్నప్పుడు ప్రతి థియేటర్‌లో ఒక సీటు ఖాళీగా ఉంచాలని ప్రొడ్యూసర్లను, డిస్ట్రిబ్యూటర్లను కోరారు. అయితే హిందువులు ఎలా స్పందిస్తున్నా హనుమంతుడి కోసం.. సినిమా హాల్ లో ఒక సీటు వదిలి పెట్టాలనే ఓం రౌత్ వ్యాఖ్యలపై హేతువాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అలా సినిమా మీద అన్ని విషయాల్లోనూ ట్రోలింగ్ జరిగింది. అయితే అదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్దమైన సమయంలో ఈ సినిమా చూసేందుకు ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతూ ఉండడంతో తమ తమ పరిధుల్లో తమ ప్రభావం చూపి అయినా టికెట్లు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే గతంలో కొన్ని సినిమాలకు వివాదాలు ప్లస్ అయ్యాయని వివాదాల వల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఉన్నాయి కాబట్టి మా సినిమా విషయంలో కూడా అదే జరుగుతోందని ధీమాగా ఉన్నారు. అలాగే ఈ వివాదాల వల్ల ఆదిపురుష్ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు కూడా. ఇక ముందు నుంచి ట్రోలింగ్ కు గురైన ఆదిపురుష్ సినిమా గురించి విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు పెరుగుతుండగా ఏకంగా మూడు గంటల నిడివితో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేస్తోంది. మోస్ట్ ట్రోల్డ్ సినిమా నుండి మోస్ట్ అవైటెడ్ సినిమా వరకు రాగలిగింది అంటే ఆదిపురుష్ ఇప్పటికే సక్సెస్ చూసేసింది, ఇక కేవలం బాక్స్ ఆఫీస్ లెక్కలు మాట్లాడాలి అంతే.. చూడాలి రఘురాముడి ‘ఆదిపురుష్’ ఎన్ని కోట్లు కొల్లగొడుతుంది అనేది.