శర్వానంద్ ఏ ఒక్క జానర్‌కు ఫిక్స్ కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అతను ‘ఒకే ఒక జీవితం’ మూవీలో చేస్తున్నాడు. అందులో శర్వా తల్లిగా అమల నటిస్తుంటే, రీతువర్మ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న మరో సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ విడుదల తేదీ కన్ ఫర్మ్ అయ్యింది. ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ వాయిదా పడటంతో అదే రోజున శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ జనం ముందుకు రాబోతోంది. ఈ కుటుంబ కథా చిత్రాన్ని కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
శర్వానంద్ సరసన రశ్మిక మందన్న నాయికగా చేస్తోంది. ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియర్ నటీమణులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.