తెరపై పంతులుగా నటించి, పాఠాలు చెప్పడం కాదు. నిజజీవితంలోనే పాఠాలు చెప్పి, ఆ పై తెరపై నటులుగా రాణించిన వారూ ఉన్నారు. మన తెలుగు చిత్రసీమ విషయానికి వస్తే పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ వంటి వారు తొలుత అధ్యాపకులుగా పాఠాలు చెప్పి ఆ తరువాత చిత్రసీమలో నటులుగానూ మురిపించారు. ప్రముఖ హాస్యనటుడు రాజబాబు టీచర్ ట్రైనింగ్ చేశాక, కొంతకాలం పంతులుగా పనిచేశారు. పాత చిత్రాల్లో ఆనంద్ మోహన్ అనే విలన్ ఉండేవారు. ఆయన కూడా తొలుత ఓ పాఠశాలలో డ్రిల్ మాస్టర్ గా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన వారే. తరువాతి రోజుల్లో నటప్రపూర్ణగా జేజేలు అందుకున్న మోహన్ బాబు కూడా ఓ స్కూల్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రక్టర్ గా చేశారు. హాస్యనటుడు గుండు సుదర్శన్ ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో కొంతకాలం లెక్చరర్ గా ఉన్నారు.
హిందీ చిత్రసీమలో సూపర్ స్టార్ డమ్ చూసిన ధర్మేంద్ర కూడా కొంతకాలం పిల్లలకు పాఠాలు చెప్పారు. ఎలాగంటే, ఆయన తండ్రి కేవల్ కిషన్ డియోల్ లూధియానాలోని గవర్నమెంట్ హై స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పనిచేసేవారు. ధర్మేంద్ర తన చదువు పూర్తయ్యాక, కొంతకాలం అక్కడే ట్యూషన్స్ చెప్పారు. తరువాతనే హిందీ చిత్రసీమలో టాప్ స్టార్ అయ్యారు. హిందీలో మేటి నటుడుగా పేరు సంపాదించిన బలరాజ్ సహానీ కూడా చిత్రసీమలో ప్రవేశించక ముందు బెంగాల్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో కొన్నాళ్ళు అధ్యాపకునిగా పనిచేశారు. పలు చిత్రాలలో కమెడియన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా అలరించిన మాటల రచయిత ఖాదర్ ఖాన్ కూడా చిత్రసీమలో అడుగు పెట్టక ముందు పాఠాలు చెప్పారు. ఖాదర్ ఖాన్ ఇంజనీరింగ్ చదివారు. బైకుల్లాలోని ఎమ్.హెచ్. సాబూ సిద్ధిక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సివిల్ ఇంజనీరింగ్ బోధించారు ఖాదర్ ఖాన్. ‘బొబ్బిలిపులి’లో క్లయిమాక్స్ లో యన్టీఆర్ తో ఫైట్ చేసే ఆస్ట్రేలియా నటుడు బాబ్ క్రిస్టో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. కొంతకాలం ఆయన కూడా ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో పాఠాలు చెప్పారు.
స్కూల్, కాలేజీల్లో పాఠాలు చెప్పినవారే కాదు, ఇతర రంగాల్లోనూ కొందరికి పాఠాలు చెప్పి తెరపైన నటులుగా అలరించిన వారు ఉన్నారు. మన తెలుగునాట దేవదాస్ కనకాలను తీసుకుంటే, ఆయన మద్రాసు, హైదరాబాద్ లో కొన్ని యాక్టింగ్ స్కూల్స్ లో పలువురు ప్రముఖ నటులకు నటశిక్షణ ఇచ్చిన గురువుగా నిలిచారు. పలు చిత్రాలలో నటునిగానూ దేవదాస్ కనకాల అలరించారు. అదే తీరున అనుపమ్ ఖేర్ నూ చెప్పుకోవచ్చు. ఈ తరం వారినీ ఆకట్టుకుంటున్న అనుపమ్ ఖేర్ సొంతగా ఓ యాక్టింగ్ స్కూల్ పెట్టి ఎంతోమంది బాలీవుడ్ నటులను తీర్చిదిద్దారు.
బ్లాక్ బ్యూటీగా పేరొందిన నందితా దాస్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. దాంతో ప్రఖ్యాత రిషివ్యాలీ స్కూల్ లో ఆమె ఓ డైరెక్టర్ గా నియమితులయ్యారు. అక్కడే నాటకరంగానికి సంబంధించిన పాఠాలు చెప్పారు.
అక్షయ్ కుమార్ కూడా పాఠాలు చెప్పిన వారే! ఆశ్చర్య పోకండి. ఖిలాడీ అక్షయ్ స్కూల్ చదువు మానేసి అనేక సంవత్సరాలు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. ఆ తరువాత తానే స్వయంగా పలువురికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చారు. అక్కడే ఓ స్టూడెంట్ కారణంగా అక్షయ్ మనసు నటనపైకి మళ్ళింది. ఆ తరువాత అక్షయ్ బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే! భవిష్యత్ లో వీరి స్ఫూర్తితో మరికొందరు పాఠాలు చెప్పినవారు తెరపై నటులుగా అలరించవచ్చేమో!