టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.ఒకప్పుడు హీరోగా సుమన్ చేసినన్ని సినిమాలు మరే హీరో చేసి ఉండడు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. చేయని తప్పుకు జైలుకు వెళ్లడం, మళ్లీ తిరిగి రావడం.. హీరోగా నిలగోక్కుకోవడం ఇలా ఎన్నో కష్టాలను ఆయన అనుభవించారు. ఇక ప్రస్తుతం అన్ని భాషల్లో విలన్ గా, సహాయక నటుడిగా ప్రేక్షకులను మెప్పిస్తున్న సుమన్ ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలపై తనదైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక నేడు దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
“చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు.. మేకర్స్ వల్ల బయ్యర్స్ సంతోషంగా ఉండడంలేదు. ఇప్పుడు ఉన్న మేకర్స్ బయ్యర్స్ గురించి ఆలోచించడం లేదు. ఒకప్పుడు దాసరి గారు బయ్యర్స్ గురించే ఆలోచించేవారు.. ఒక సినిమా ప్లాప్ అయితే నెక్స్ట్ సినిమాను ఫ్రీ గా చేసి అయినా బయ్యర్స్ ను కాపాడేవారు. కానీ ఇప్పుడు కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకంతో బయ్యర్స్ కొంటున్నారు. ఒకవేళ ఆ సినిమా ప్లాప్ అయితే నష్టపోయేది బయ్యర్లే.. అసలు బయ్యర్ల గురించి ఆలోచించేవారే లేరు. సినిమా షూటింగ్స్‌లో సమయపాలన అసలు లేదు. నిర్మాతకు అదనపు భారం కలిగేలా మేకర్స్ ఉన్నారు. ఇది నేను ఆవేశంలో మాట్లాడుతున్నాను అనుకున్నా .. ఇది మాత్రం నిజం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.