Ahmisa: దగ్గుబాటి వారసుడు అభిరామ్ దగ్గుబాటి ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే బాధ్యతను అందుకున్నాడు డైరెక్టర్ తేజ. ఇప్పటికే దగ్గుబాటి అభిరామ్.. వివాదాలతో చాలా ఫేమస్ అయ్యాడు. ఇక ఈ వివాదాలన్నీ సద్దుమణిగాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. సినిమా సెట్స్ మీదకు వెళ్ళేటప్పుడు ఈ సినిమా టైటిల్ అహింస అని తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశాడు తేజ. అంతే.. ఆ పోస్టర్ తప్ప ఈ సినిమా గురించిన ఒక అప్డేట్ ను మేకర్స్ ఇవ్వలేదు. మధ్యలో ఎన్నో పండగలు, బర్త్ డే లు వచ్చినా అభిరామ్ లుక్ ను మాత్రం చూపించలేదు. ఇక మధ్యలో ప్రీ లుక్ పోస్టర్ అంటూ రక్తంతో తడిసిన అభిరామ్ ముఖానికి గోనె సంచిని కట్టి ఉన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో దగ్గుబాటి వారసుడి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇక దీంతో ఫస్ట్ లుక్ కు అయినా అభిరామ్ ముఖాన్ని చుపిస్తారేమో అనుకున్నారు ప్రేక్షకులు.. కానీ వారి ఆశను నిరాశపర్చాడు తేజ.
నేడు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ గ్లింప్స్ లో ఒక ఎత్తైన కొండ ప్రాంతంలో నలుగురు మనుషులు, ఒక లేడీ అభిరామ్ ను కొట్టుకొంటూ తీసుకెళ్తున్నారు. వారి నుంచి హీరో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా అతనివలన కావడంలేదు. దీంతో ఆ రౌడీలు అతడిని రక్తం వచ్చేలా కొడుతుండడంతోనే అహింస ఫస్ట్ గ్లింప్స్ ముగుస్తోంది. ఇందులో కూడా అభిరామ్ ముఖాన్నీ చూపించలేదు తేజ. అసలు అహింస అని టైటిల్ పెట్టి హింసను మాత్రమే చూపించారు. అసలు హీరోను ఎందుకు అంతలా హింసిస్తున్నారు..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? అనేది మిస్టరీగా మారింది. ఇక ఎన్నాళ్లు దగ్గుబాటి వారసుడి ముఖం చూపించకుండా దాస్తావ్ తేజ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ దగ్గుబాటి వారసుడు ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.