‘సొంతవూరు, గంగపుత్రులు’ వంటి అవార్డ్ విన్నింగ్ మూవీస్ తో పాటు సమాజాన్ని షాక్ కు గురిచేసే ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస’ వంటి చిత్రాలనూ రూపొందించారు సునీల్ కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో బి. బాపిరాజు, ఎం. నాగ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘#69 సంస్కార్ కాలనీ’. ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ గురించి ఎస్తర్ మాట్లాడుతూ, ”తెలుగు సినిమా ఎమోషనల్ గా నా మనసుకు దగ్గరగా ఉంటుంది. నేను చేసిన సినిమాలు తక్కువే అయినా తెలుగు ప్రేక్షకులు నన్నెంతో ఆదరించడంతో నాకు మంచి గుర్తింపు లభించింది. తెలుగువారు నాపై చూపించిన ప్రేమను నేనెప్పుడూ మర్చిపోలేను.
ఇక మీదట మంచి సినిమా చేయాలి అనుకుంటున్నా టైంలో సునీల్ కుమార్ గారు ఈ కథ చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇది ఫాంటసీ మూవీనో, ఇమాజినేషన్ మూవీనో కాదు, స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమా. ప్రస్తుతం సొసైటీలో రిలేషన్ షిప్ అనేది చాలా కాంప్లికేటెడ్ అయ్యింది. ఇప్పుడు మనం బ్రతుకుతున్న లైఫ్ కూడా చాలా కాంప్లికేటెడ్. ఇలాంటి సొసైటీ లో జరుగుతున్న చాలా విషయాల్లో లో-హ్యూమాన్ రిలేషన్ షిప్ ఒకటి. ఈ పాయింట్ ను బేస్ చేసుకుని మంచి కథనంతో దీనిని రూపొందించారు. ఇది ఆసక్తికరంగానే కాకుండా వినోదాత్మకంగానూ ఉంటుంది” అని అన్నారు.
నిర్మాత బాపిరాజు మాట్లాడుతూ, ”సునీల్ కుమార్ రెడ్డి కంటెంట్ ఉన్న కథలు చేయడాన్ని ఇష్టపడతారు. ‘గంగపుత్రులు, సొంత ఊరు, గల్ఫ్’ లాంటి సినిమాలు మాత్రమే కాదు రొమాంటిక్ అంశాలు ఉన్న చిత్రాలను సైతం గతంలో తీసి మెప్పు పొందారు. కేవలం యువతని ఆకర్షించడానికి మాత్రమే కాకుండా కధకు ఉన్న అవసరం బట్టి బోల్డ్ గా చిత్రీకరించడానికి వెనుకాడని దర్శకుడు ఆయన. ఈ కథను తను కూడా ప్రేమించి యువతకి నచ్చేలా తీర్చిదిద్ది మాకు అందించినందుకు ధన్యవాదాలు” అని అన్నారు.