చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ స్వయంకృషితో చిత్రసీమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన వారు. వారిద్దరూ కలసి ‘శ్రీరామబంటు’ మొదలు ‘కొదమసింహం’ వరకు అనేక చిత్రాల్లో మిత్రులుగా, శత్రువులుగా నటించి అలరించారు. 35 ఏళ్ళ క్రితం చిరంజీవి, మోహన్ బాబు మిత్రులుగా నటించిన ‘చక్రవర్తి’ కూడా జనాన్ని ఆకట్టుకుంది. తరువాతి కాలంలో చిరంజీవికి ‘యముడికి మొగుడు’, మోహన్ బాబుకు ‘పెదరాయుడు’ వంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘చక్రవర్తి’ రూపొందడం విశేషం! చిరంజీవి తోడల్లుడు డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఈ సినిమాను తమ వసంత ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. 1987 జూన్ 4న ‘చక్రవర్తి’ సినిమా విడుదలయింది.
ఈ చిత్రానికి తమిళంలో శివాజీగణేశన్ హీరోగా రూపొందిన ‘జ్ఞాన ఓలి’ సినిమా ఆధారం. ఆ సినిమాకు కొన్ని మార్పులూ చేర్పులూ చేసి ‘చక్రవర్తి’ని తెరకెక్కించారు. ఒరిజినల్ లో తండ్రి, కూతురు మధ్య సాగే కథను ఇందులో అన్నాచెల్లెళ్ళ కథగా మార్పు చేశారు.
కథ విషయానికి వస్తే – అంజికి తన చెల్లెలు లక్ష్మి ఆరో ప్రాణం. ఇక గురువు స్వామిజీ మాట అంటే రామవాక్కు. అంజి చిన్నప్పటి మిత్రుడు మోహన్. అతను పోలీస్ ఇన్ స్పెక్టర్. అంజి అంటే ఆ ఊరి పోస్ట్ మాస్టర్ కూతురు రాణికి ఎంతో ప్రేమ. మోహన్ కు లక్ష్మికి పెళ్ళి చేయాలనుకుంటారు స్వామిజీ. కానీ, ఆమె ప్రేమ్ బాబు అనేవాణ్ణి ప్రేమించి ఉంటుంది. వాడి దగ్గరకు వెళ్ళి తన చెల్లెలిని పెళ్ళి చేసుకోమని అడుగుతాడు అంజి. అందుకు వెటకారంగా మాట్లాడి, గేలి చేసిన ప్రేమ్ బాబు, అతని మిత్రులకు దేహశుద్ధి చేస్తాడు అంజి. అయితే ప్రేమ్ చనిపోవడంతో అతడిని చంపింది అంజినే అని అరెస్ట్ చేస్తాడు మోహన్. జైలుకు వెళతాడు అంజి. స్వామిజీ ఆరోగ్యం బాగోలేకపోతే, అంజిని చూడాలని కోరతాడు. ఆయన మాటంటే వేదవాక్కుగా భావించి, మోహన్ అంజిని తీసుకు వస్తాడు. అంజి విడుదలయ్యాక, వాడిని సమాజం హంతకుడు అంటుందని, ఎలాగైనా నీవే వాడిని మార్చాలని స్వామిజీ కోరతాడు. అందుకు మోహన్ అంగీకరిస్తాడు. కానీ, అంజి తప్పించుకు పోతాడు. ఆ పారిపోయే సమయంలో అంజి చనిపోయాడని భావిస్తారు. తరువాత బాగా డబ్బు సంపాదించి, చక్రవర్తిగా తిరిగి వస్తాడు. ఆ ఊరిని స్వామిజీ కోరిన విధంగా తీర్చిదిద్దడానికి పూనుకుంటాడు అంజి. చనిపోయిందనుకున్న అంజి చెల్లెలు లక్ష్మి కూడా ఓ చోట పనిచేస్తూ మోహన్ కు కనిపిస్తుంది. చక్రవర్తి, రాణి కలుసుకుంటారు. చక్రవర్తియే అంజి అని అనుమానిస్తూ, అతణ్ణి ఎలాగైనా అరెస్ట్ చేయాలని భావిస్తాడు మోహన్. కానీ, అంజికి అన్ని కష్టాలు తెచ్చిపెట్టింది, అతనంటే పడని ఆ ఊరి ప్రెసిడెంట్ అన్న విషయం తెలుస్తుంది. సాక్ష్యాధారాలతో ప్రెసిడెంట్ ను దోషిగా నిరూపించడంలో చక్రవర్తి, మోహన్ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూనే పాలు పంచుకుంటారు. చివరకు ఇద్దరు మిత్రులు కలసి పోతారు. చక్రవర్తి రాణి చేయి అందుకోగా, లక్ష్మిని మోహన్ భార్యగా స్వీకరించడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రానికి జయకృష్ణ సమర్పకులు. వియత్నాం వీడు సుందరమ్ కథకు గణేశ్ పాత్రో రచనలో రవిరాజా పినిశెట్టి కొన్ని మార్పులు చేసి స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఇందులో చిరంజీవి, మోహన్ బాబు, భానుప్రియ, రమ్యకృష్ణ, జె.వి.సోమయాజులు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, వేలు, రంగనాథ్, సాక్షి రంగారావు, సుధాకర్, బ్రహ్మానందం నటించారు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా రమ్యకృష్ణ అభినయించారు. వేటూరి, సీతారామశాస్త్రి పాటలు పలికించగా, చక్రవర్తి స్వరకల్పన చేశారు. “ఏరు జోల పాడెనయ్యా స్వామీ…”, “వన్నెల రాణీ…”, “సందిట్లో చిక్కిందమ్మా జాబిల్లి…”, “మబ్బులు విడివడిపోయె…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి.