చాయ్ బిస్కెట్ సంస్థ గర్ల్ ఫార్ములా కేటగిరిలో స్ట్రీమింగ్ చేస్తున్న ‘థర్టీ వెడ్స్ ట్వంటీ వన్’ సీజన్ 2, ఐదవ ఎపిసోడ్ ఆదివారం నుండి అందుబాటులోకి వచ్చింది. లాస్ట్ ఎపిసోడ్ మొత్తం కార్తీక్ తండ్రి కావడం మీద నడిపిన డైరెక్టర్ పృథ్వీ వనం ఇప్పుడీ లేటెస్ట్ ఎపిసోడ్ ను మేఘన బర్త్ డే, దాని పర్యవసానంపై తీశాడు.
కొత్త ఉద్యోగంతో సతమతమౌతున్న మేఘన బర్త్ డే ను కాస్తంత స్పెషల్ గా జరపాలని పృథ్వీ భావిస్తాడు. ఆమె కోసం ప్రేమగా ఓ కేక్ కూడా తయారు చేస్తాడు. కానీ ఆ కేక్ కట్ చేసి, అతని విషెస్ వినే ఓపిక కూడా మేఘన దగ్గర ఉండదు. ఉదయాన్నే అతను నిద్రలేపి కేక్ తెచ్చే సరికీ మళ్ళీ ముసుగుతన్ని పడుకుంటుంది. చిత్రం ఏమంటే ఆమె పుట్టిన రోజు ను పురస్కరించుకుని ఫాదర్ ఊరి నుండి పని గట్టుకుని వచ్చినా ఆయన్నీ పట్టించుకోదు. ఇక మేఘన ఆఫీస్ కు వెళ్ళడంతో డే టైమ్ అంతా అల్లుడితోనే అదే ఫ్లాట్ లో గడిపేస్తాడాయన. డిగ్రీ కాగానే తన పెళ్లి చేసి గుండెల మీద బరువు దించుకున్నారని మేఘన భావిస్తే, సరైన సమయంలో మంచి కుర్రాడికి ఇచ్చి బాధ్యతను నెరవేర్చుకున్నానని ఆమె తండ్రి అభిప్రాయ పడతాడు. తండ్రి పనులను పాజిటివ్ గా మేఘన తీసుకోలేకపోతే, ఆమె కోసమే తానన్నీ చేశానని తండ్రి ఫీలవుతుంటాడు. చివరకు తన మీద కూతురుకి ఉన్నది కోపం కాదని, అలక అని సర్థుకు పోతాడు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ తండ్రి మనసు వర్సెస్ కూతురు మనసు అన్నట్టుగా సాగింది.
ఇక మేఘన ఇంటికి రాగానే జరిగే వాగ్యుద్ధంలో పృథ్వీదే సబబు అనిపిస్తుంది. అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూనే మేఘన హ్యాపీగా ఉండటానికి కష్టపడుతోంది నిజమే కదా అనుకుంటాం. ఆ రకంగా ఓ ఆరేడు నిమిషాల సన్నివేశాన్ని నడిపి, చివరలో ‘మేఘమెంత దూరమున్నా… వర్షమై చేరేది నిన్నే పృథ్వీ’ అనే ఒకే ఒక్క వాక్యంతో సీన్ మొత్తాన్నీ మేఘనకు అనుకూలంగా మార్చేశాడు దర్శకుడు.
బిజీగా ఉండే భార్య బర్త్ డే సెలబ్రేట్ చేయడానికి భర్త చేసే ప్రయత్నం, దానిని సరిగా అర్థం చేసుకోలేని భార్య వ్యవహారం, కూతురు మనసు ఎరగని తండ్రి, పుట్టబోయే పిల్లాడిని ఎలా పెంచాలో అని భయాందోళనకు గురయ్యే కార్తీక్… ఇలా ఈ ఎపిసోడ్ కాస్తంత భారంగానే సాగింది. మొత్తం మీద వీక్షకులు కోరుకునే ఫన్ మిస్ అయ్యిందనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ను తీసుకుంది మేఘన తండ్రి పాత్ర పోషించిన వంశీ నెక్కంటి. ఆయన నటన సహజంగా ఉంది. ఇక రెగ్యులర్ గా ఉండే బిట్ సాంగ్స్ మామూలే. బాగున్నాయి. అయితే… వచ్చే ఆదివారమైన కాస్తంత ఫన్ క్రియేట్ చేసే ఎపిసోడ్ ను అందిస్తే బాగుంటుంది. లేకపోతే వ్యూవర్స్ బోర్ డమ్ ఫీలయ్యే ఛాన్స్ ఉంటుంది.