3 Incidents In One Year In Mahesh Babu House: ఈ ఏడాదిలో మహేశ్ బాబు ఇంట మూడు విషాదాలు చోటు చేసుకున్నాయి. తొలుత మహేశ్ సోదరుడు రమేశ్ బాబు జనవరిలో అనారోగ్యంతో కన్ను మూశాడు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆరోగ్యం విషమించి.. జనవరి 8న ఆయన తుదిశ్వాస విడిచాడు. అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి మహేశ్ తేరుకోకముందే.. తల్లి ఇందిరాదేవి దూరం అయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 28వ తేదీన మృతి చెందారు. తల్లి దూరమైన బాధని ఇప్పుడిప్పుడు మరిచిపోతున్న తరుణంలో.. కన్నతండ్రి మరణం మహేశ్‌ను మరింత విషాదంలో నెట్టేసింది.
ఆదివారం సాయంత్రం వరకూ ఆరోగ్యంగానే ఉన్న సూపర్‌స్టార్ కృష్ణకి రాత్రి గుండెపోటు వచ్చింది. అప్పుడు కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా బ్రెయిన్‌తో పాటు కిడ్నీ, లివర్ ఎఫెక్ట్ అయ్యాయి. దీంతో 8 విభాగాలకు చెందిన 8 మంది ప్రత్యేక వైద్య నిపుణుల్ని రంగంలోకి దింపి.. ప్రపంచస్థాయి చికిత్స అందించారు. అయితే.. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, చికిత్స పొందుతూ కృష్ణ ఈరోజు (15-11-22) ఉదయం 4 గంటలకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కృష్ణ మృతితో చిత్రసీమ శోకసంద్రంలో మునిగింది. అభిమానులు సైతం కృష్ణ మృతితో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమ అభిమాన నటుడు ఇక లేడన్న సంగతి తెలిసి, కన్నీరుమున్నీరు అవుతున్నారు.