2021లో దాదాపు 270 తెలుగు సినిమాలు విడుదలైతే అందులో స్ట్రయిట్ మూవీస్ సుమారు 200. థియేటర్లలో కాకుండా ఇందులో ఇరవైకు పైగా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యాయి. విశేషం ఏమంటే యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోలనూ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొత్త దర్శకులకు ఈ యేడాది లభించింది. మరి ఈ నయా దర్శకులలో ఎవరెవరు తమ సత్తా చాటారో తెలుసుకుందాం.
అక్కినేని నాగార్జున నటించిన ఒకే ఒక్క చిత్రం ‘వైల్డ్ డాగ్’ ఈ యేడాది జనం ముందుకు వచ్చింది. ఆ మూవీతో తెలుగువాడే అయిన అహిషోర్ సాల్మన్ దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. చిత్రం ఏమంటే తెలుగుతో పాటు కొన్ని హిందీ చిత్రాలకూ రచన చేసిన సాల్మన్ ఇప్పటికే హిందీలో ‘జాన్ డే’ సినిమాను డైరెక్ట్ చేశాడు. ‘వైల్డ్ డాగ్’ మూవీ కథలో కొత్తదనం లేకపోవడంతో సాల్మన్ కు పెద్దంత గుర్తింపు దక్కలేదు. ఇక ఇప్పటికే మలయాళంలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసఫ్ తొలిసారి వెంకటేశ్ ‘దృశ్యం-2’తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాకు వీక్షకుల నుండి మంచి స్పందనే వచ్చింది. అలానే రానా ‘అరణ్య’తో తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినట్టు అయ్యింది.
ఈ యేడాది దర్శకులుగా అరంగేట్రమ్ చేసి సక్సెస్ అయిన వారిని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. చిత్రం ఏమంటే అలా విజయం సాధించిన దర్శకులు సైతం మలి అవకాశాలను అందుకుని కొత్త సినిమాలను ప్రారంభించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. వైష్ణవ్ తేజ్, కృతీశెట్టి ‘ఉప్పెన’ మూవీతో బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ హీరో, హీరోయిన్లు వరుసగా సినిమాలు చేస్తున్నా, బుచ్చిబాబు మాత్రం రెండో ప్రాజెక్ట్ కోసం వేచిచూస్తున్నాడు. అలానే కమర్షియల్‌గా గ్రాండ్ సక్సెస్ సాధించకపోయినా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మూవీతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మున్నా. ఆయన మలి చిత్రం విషయంలోనూ ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు.
ఇక ‘అల్లరి’ నరేశ్ ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలను విజయ్ కనకమేడల అందుకున్నాడు. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు హిందీలోనూ రీమేక్ చేయబోతున్నాడు. కానీ విజయ్ రెండో సినిమా విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. కిరణ్ అబ్బవరం ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ మూవీతో తొలిసారి మెగాఫోన్ పట్టాడు శ్రీధర్ గాదె. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్‌ను అందుకుంది. అలానే ఆ తర్వాత వచ్చిన శ్రీవిష్ణు ‘రాజరాజ చోర’తో రచయిత హాసిత్ గోలి దర్శకుడయ్యాడు. ఈ సినిమాకు చక్కని ఆదరణే లభించింది. వీరిద్దరి తదుపరి సినిమాలేమిటన్నది ఇంకా ప్రకటించలేదు.
ఈ సంవత్సరం కొత్త మహిళా దర్శకులు పెద్దంత హడావుడి ఏమీ చేయలేదు. ‘జి – జాంబి’ మూవీని ఆర్యన్ గౌరతో కలిసి దీపు డైరెక్ట్ చేసింది. అలానే కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోణంకి ‘పెళ్ళి సందడి’ మూవీని డైరెక్ట్ చేసింది. ఇక శ్రియా, నిత్యామీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ నటించిన ‘గమనం’తో సుజనారావు తొలిసారి మెగా ఫోన్ పట్టింది. కానీ ఈ చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే, నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’తో దర్శకురాలైన లక్ష్మీ సౌజన్య తనకంటూ కొంత గుర్తింపును తెచ్చుకుంది. విశేషం ఏమంటే… నాగశౌర్య నటించిన రెండు సినిమాలు ఈ యేడాది విడుదల కాగా, ఆ రెండు సినిమాలకూ కొత్తవారే దర్శకులు. అతని ‘లక్ష్య’ సినిమాను సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేశాడు. అలానే మరో యంగ్ హీరో కార్తికేయ సినిమాలు రెండు ఈ సంవత్సరం జనం ముందుకు వచ్చాయి.
‘చావు కబురు చల్లగా’తో కౌశిక్, ‘రాజా విక్రమార్క’తో శ్రీ సారిపల్లి దర్శకులుగా మారారు. కానీ ఈ రెండు సినిమాలూ కార్తికేయను నిరాశకు గురిచేశాయి. మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘పాగల్’ మూవీతో నరేశ్ కుప్పిలి దర్శకుడిగా మారాడు. ఆ సినిమా జనాలను మెప్పించలేదు. అందాల భామ నిత్యా మీనన్ తన కెరీర్ లోనే తొలిసారి ‘స్కైలాబ్’ మూవీకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. కథ, కథనాలలో కొత్తదనం ఉన్నా, స్లో నెరేషన్ తో సాగిన ఈ మూవీని జనం మెచ్చలేదు. దీంతో విశ్వక్ ఖండేరావ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్, నటి ఛార్మి నిర్మించిన సినిమా ‘రొమాంటిక్’. ఈ మూవీతో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ అనిల్ పాడూరి దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు, కానీ ప్రతికూల ఫలితాన్నే పొందాడు. ఇక మరో యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈ యేడాది రెండు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అందులో అతనే హీరోగా నటించిన ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’తో డెన్నీస్ జీవన్ కనుకొలను సత్య హీరోగా నటించిన ‘వివాహ భోజనంబు’తో రామ్ అబ్బరాజు దర్శకులుగా పరిచయమయ్యారు. కానీ రెండు చిత్రాలు సందీప్ కిషన్ కు నిరాశను కలిగించాయి.
ఈ సంవత్సరం చాలామందే కొత్త దర్శకులు తెలుగులో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. అందులో కొందరికి కాస్తంత పేరున్న హీరోలతో సినిమా చేసే ఛాన్సే దక్కింది. కానీ రకరకాల కారణాలతో వారెవ్వరూ తమదైన ముద్రను వేయలేకపోయారు, విజయాన్ని అందుకోలేకపోయారు. సుమంత్ నటించిన ‘కపటధారి’తో తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. బుల్లితెర స్టార్ సాగర్ మూవీ ‘షాదీ ముబారక్’తో పద్మశ్రీ,, రాజేంద్ర ప్రసాద్ ‘క్లైమాక్స్’తో భవానీ శంకర్, శర్వానంద్ ‘శ్రీకారం’తో కిశోర్ రెడ్డి, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’తో విదేశీ దర్శకుడు జెఫ్రీ జీ చిన్, ఆది సాయికుమార్ ‘శశి’తో శ్రీనివాస నాయుడు, కీరవాణి తనయుడు శ్రీసింహా ‘తెల్లవారితే గురువారం’తో మణికాంత్, యంగ్ హీరో తేజ సజ్జా ‘ఇష్క్’తో ఎస్.ఎస్. రాజు, ‘అద్భుతం’తో మల్లిక్ రామ్, సునీల్ ‘కనబడుట లేదు’తో ఎం బాలరాజు, సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో ఎస్. దర్శన్, అవసరాల శ్రీనివాస్ ‘101 జిల్లాల అందగాడు’తో ఆర్. విద్యాసాగర్, సంధ్యారాజ్ ‘నాట్యం’తో రేవంత్ కోరుకొండ, ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’తో దామోదర్, శ్రీకాంత్ ‘ఇదే మా కథ’తో గురు పవన్, అలీ ‘లాయర్ విశ్వనాథ్’తో ‘వి. బాల నాగేశ్వరరావు, ఆమని ‘అమ్మ దీవెన’తో శివ ఏటూరి, మహత్ రాఘవేంద్ర ‘సైకిల్’తో ఆట్ల అర్జున్ రెడ్డి దర్శకులుగా పరిచయం అయినా వారెవరినీ సక్సెస్ పలకరించలేదు.
ఇక చాలామంది కొత్త దర్శకుల సినిమాలు పలు ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యాయి. అశ్విన్ గంగరాజు (ఆకాశవాణి), సుప్రీత్ సి. కృష్ణ (అలాంటి సిత్రాలు), రవీంద్ర పుల్లె (అర్థశతాబ్దం), కార్తీక్ రాపోలు (ఏక్ మినీ కథ), కార్తీక్ తిపురాని (బ్రో), మెహర్ తేజ్ (ఫ్యామిలీ డ్రామా), శ్రీకృష్ణ – రామసాయి (పచ్చీస్) దర్శకులుగా తెలుగువారి ముందు కొచ్చారు. అయితే వీరి సినిమాలేవీ వీక్షకుల మీద పెద్దంత ప్రభావం చూపలేదు. రాబోయే రోజుల్లో అయినా కొత్త దర్శకులు ప్రామిసింగ్ స్టోరీస్ తో ఆడియెన్స్ ను మెప్పిస్తారేమో చూడాలి.