కొంతమందికి నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సినిమా టైటిల్స్ భలేగా అచ్చి వస్తాయి. మహేశ్ బాబుకు అక్కినేని పాత సినిమా టైటిల్స్ ‘యువరాజు, శ్రీమంతుడు’ కలసి వచ్చాయి. అదే తీరున నాటి స్టార్ కమెడియన్ సునీల్ కూడా ‘అందాల రాముడు’, ‘పూలరంగడు’ వంటి ఏయన్నార్ సినిమా టైటిల్స్ తో గ్రాండ్ సక్సెస్ పట్టేశారు. ‘అందాలరాముడు’తో హీరోగా సక్సెస్ చూశారు సునీల్. తరువాత కొన్ని సినిమాల్లో హీరో స్థాయి పాత్రలు ధరించారు. ఆ పై రాజమౌళి ‘మర్యాద రామన్న’తో బంపర్ హిట్ కొట్టేశారు సునీల్. ఆ తరువాత సునీల్ తో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు’ నిరాశ పరచినా, మళ్ళీ సునీల్ కు హిట్ ను అందించిన చిత్రం ‘పూలరంగడు’. ఈ సినిమా టైటిల్ తోనే కాదు, ఈ చిత్రం విడుదలైన తేదీతోనూ ఏయన్నార్ కు అనుబంధం ఉందని చెప్పవచ్చు. 1967లో అక్కినేనిని వరుస పరాజయాలు పలకరించాయి. ఆ సమయంలో ఆయనను మళ్ళీ సక్సెస్ ట్రాక్ పై నిలిపిన చిత్రంగా ‘పూలరంగడు’ నిలచింది. అదే తీరున హీరోగా నిరాశ చెందిన సునీల్ కు ఈ ‘పూలరంగడు’ మంచి విజయాన్ని అందించింది. మరో విశేషమేమిటంటే, ‘పూలరంగడు’ 2012 ఫిబ్రవరి 18న విడుదలయింది. ఫిబ్రవరి 18వ తేదీ అక్కినేని అభిమానులకు ప్రత్యేకమైనది. ఎందుకంటే అది ఏయన్నార్ మ్యారేజ్ డే, అలాగే అక్కినేని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన ‘ప్రేమాభిషేకం’ విడుదల తేదీ కూడా అదే! అలా ఏయన్నార్ టైటిల్ నే కాదు, ఆయన జీవితంలో ప్రత్యేకమైన తేదీన సునీల్ ‘పూలరంగడు’ను విడుదల చేసి, విజయం సాధించారు.
ఈ ‘పూలరంగడు’ కథ విషయానికి వస్తే – రంగ మంచివాడు. తన ఇంటిని అమ్మి చెల్లెలి పెళ్ళి చేయాలని భావిస్తూంటాడు. అదే సమయంలో 30 ఎకరాల సారవంతమైన భూమి కొంటే తరువాత బోలెడు లాభం వస్తుందని కొందరు చెబితే, ఇల్లు అమ్మి ఆ పొలం కొంటాడు. అయితే ఆ పొలం సమస్యల్లో ఉందని తెలుస్తుంది. పొలానికి అటు, ఇటు ఉన్న కొండారెడ్డి, లాలా గౌడ్ బద్ధ శత్రువులు. పరమ కిరాతకులు. ఒకరంటే ఒకరికి పడదు. ఎందువల్లనంటే కొండారెడ్డి తండ్రి వద్ద ఒకప్పుడు పనిచేసే లాలా గౌడ్, అతని అక్కను ప్రేమించి పెళ్ళాడి ఉంటాడు. దాంతో కొండారెడ్డికి, లాలా గౌడ్ కూతురు అనితను పెళ్ళాడి ఆమెను టార్చర్ పెట్టాలని చూస్తుంటాడు. తాను కొన్న పొలాన్ని అమ్మే క్రమంలో అనితకు రంగ పరిచయం అవుతాడు. ఆమె అతని మంచి మనసు చూసి ప్రేమిస్తుంది. అయితే రంగను చంపేసి, అనితను పెళ్ళాడాలని కొండారెడ్డి పథకం వేస్తాడు. చివరకు అతణ్ణి చిత్తు చేసి, అనిత చేయి అందుకుంటాడు రంగ.
ఇందులో సునీల్ సరసన ఇషా చావ్లా నాయికగా నటించింది. కోట శ్రీనివాసరావు, దేవ్ గిల్, ప్రదీప్ రావత్, అలీ, సుమిత్ర, సత్యం రాజేశ్, పృథ్వీరాజ్, రఘుబాబు, దువ్వాసి మోహన్, సుధ, ప్రగతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ కట్టిన బాణీలకు చంద్రబోస్, వనమాలి, కందికొండ, అనంత్ శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి పాటలు రాశారు. ఇందులోని “పూలరంగడు…”, “నువ్వు నాకు కావాలి…”, “ఒక్కడే ఒక్కడే…”, “నువ్వే నువ్వేలే…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి.
‘పూలరంగడు’ చిత్రం మంచి విజయం సాధించింది. అలాగే నిర్మాతలకు మంచి లాభాలూ చూపించింది. కొన్ని కేంద్రాలలో శతదినోత్సవాలూ చూసిందీ చిత్రం. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని వీరభద్రం దర్శకత్వంలో ఆర్.ఆర్.వెంకట్, అచ్చిరెడ్డి నిర్మించారు. హీరోగా సునీల్ కు ‘పూలరంగడు’ మంచి పేరు సంపాదించి పెట్టింది.