బుల్లితెరపై మురిపించి, వెండితెరపై వెలిగిపోయిన తారలు బాలీవుడ్ లో చాలామందే కనిపిస్తారు. వారిలో అందరికీ ముందుగా షారుఖ్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ తరం వారికి మాత్రం ఆయుష్మాన్ ఖురానా చప్పున మదిలో మెదలుతారు. బాలీవుడ్ లో నటునిగా ఈ యేడాదితో పదేళ్ళు పూర్తి చేసుకున్నారు ఆయుష్మాన్. నటుడు, నిర్మాత జాన్ అబ్రహామ్ నిర్మించిన ‘విక్కీ డోనర్’తో తొలిసారి బిగ్ స్క్రీన్ పై మెరిశారు ఆయుష్మాన్ ఖురానా. ఆ సినిమా 2012 ఏప్రిల్ 20న జనం ముందు నిలచింది.
ఈ పదేళ్ళలో ఆయుష్మాన్ ఖురానా ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమాతో ఆకట్టుకుంటూనే వస్తున్నారు. 2015లో ఆయుష్మాన్ నటించిన ‘ధమ్ లగా కే హైసా’ విజయంతో ఆయనకు మరింత గుర్తింపు లభించింది. “మేరీ ప్యారీ బిందు, బరైలీకీ బర్ఫీ, శుభ్ మంగళ్ సావధాన్, బదాయి హో, డ్రీమ్ గర్ల్” సినిమాలు ఆయుష్మాన్ కు నటునిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. ‘అంధాధున్’లో ఆయుష్మాన్ నటన మరింతగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో ఉత్తమ నటునిగా జాతీయ అవార్డునూ అందుకున్నారు ఖురానా. ‘ఆర్టికల్ 15’లో అయాన్ రంజన్ పాత్రలో ఆయుష్మాన్ అభినయం మరిన్ని మార్కులు పోగేసింది. గత సంవత్సరం ఆయుష్మాన్ నటించిన ‘చండీగఢ్ కరే ఆషిఖీ’ చిత్రం నిరుత్సాహ పరచింది. దాంతో ఈ సారి మే 27న జనం ముందు నిలిచే ‘అనేక్’ సినిమా పైనే ఆయుష్మాన్ తో పాటు ఆయన అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. సినీ నటునిగా దశాబ్దం పూర్తి చేసుకున్న ఆయుష్మాన్ కు ‘అనేక్’ ఎలాంటి అనుభూతి కలిగిస్తుందో చూడాలి.