మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో విశ్రాంతి, మంచి నిద్ర అంతే అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవాలని అందరూ అంటుంటారు. ప్రపంచస్థాయి ఆరోగ్య సంస్థలు కూడా ఎనిమిది గంటలు నిద్రపోవాలని అంటున్నాయి. కానీ ఎన్ని గంటలు నిద్రపోవాలనే విషయం అంతా తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి రోగాలెలా వస్తాయో చూస్తే.. ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది.
సాధారణంగా మనం ఎనిమిది గంటలు నిద్రపోవాలని డాక్టర్లు చెబుతుంటారు. ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి అంత మంచివి కావు. అయితే ఎక్కువ నిద్ర అనేది ఈరోజుల్లో సాధ్యం కావడం లేదు. అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలి. చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలి.. టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలని నిపుణులు అంటున్నారు.మన జీవనశైలి, పరుగుల ప్రపంచంలో పని ఒత్తిడి కారణంగా చాలామంది నిద్రకు దూరమవుతున్నారు.
నిద్రలేమికి కారణం అనారోగ్యమని చెప్పలేం. కానీ నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని లండన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు చెబుతున్నారు. సరిగా నిద్రపోకపోవడం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కొంతమంది నిద్రపోవడానికి మందులు వాడుతూ ఉంటారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన పరిశోధన, సరిగా నిద్రపోకపోవడం వల్ల న్యూరోడెజెనరేటివ్ వ్యాధి అభివృద్ధి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నిద్రాభంగం లేదా నిద్రలేమి వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
Read Also: India’s First C-295 Aircraft: టాటా, ఎయిర్‌బస్ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం
ఐదు గంటల కంటే తక్కువ నిద్ర పోవడం ఆరోగ్యానికి ప్రమాదాన్ని సూచిస్తుంది. ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం, కూర్చుని చేసే ఉద్యోగాలు వల్ల విపరీతమైన మానసిక ఒత్తిడి పెరగడం వంటి అనేక కారణాలు నిద్ర భంగానికి కారణంగా మారుతున్నాయి. రాత్రివేళ పడుకున్న తర్వాత తరచూ అర్ధరాత్రిలో మెలకువ రావడం సంభవిస్తే ఖచ్చితంగా వైద్యనిపుణుడిని సంప్రదించాలని చెబుతున్నారు.ప్రతిరోజూ జరిగే నిద్రాభంగాన్ని అశ్రద్ధ చేయకుండా వైద్యులకు చూపించుకోవాలి అని వారు సూచిస్తున్నారు. అది క్రమంగా ఇన్ సోమ్నియాకు దారితీస్తుందని అంటున్నారు. నిద్రపోయేటప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర గాడ్జెట్స్ బెడ్రూంకి దూరంగా పెట్టుకోవడం ఎంతోమంచిది. నిద్ర భంగానికి గురవుతున్న వారు తాము నిద్ర పోవడానికి వీలుగా తమ పడకగదిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. బెడ్ రూంలో సాధ్యమైనంత తక్కువ లైటింగ్ ఉంటే త్వరగా నిద్ర పడుతుందని చెబుతున్నారు. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కళ్లు మూసుకుని, సరైన భంగిమలో నిద్రపోవడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
Read Also: Unstoppable: ‘బుల్ బుల్ అన్ స్టాపబుల్’ సాంగ్ రిలీజ్ చేసిన గోపీచంద్!