Covid-19: 2019లో ప్రారంభమైన కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. చైనా, భారత్, ఇటలీ, అమెరికా ఇలా అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. తన రూపాన్ని మార్చుకుంటూ కోవిడ్-19 ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. మహమ్మారి వల్ల ప్రపంచంలో లక్షల చావులు నమోదయ్యాయి. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం కరోనాను అడ్డుకోగలిగాం.
ఇదిలా ఉంటే కొంతమందికి కరోనా వైరస్ సోకినప్పటికీ, వారు విజయవంతంగా దాన్ని ఎదుర్కొన్నారు. ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదు. ఇలా ఎందుకు జరుగుతోందనే దానిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. సైన్స్ జర్నల్ నేచర్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం, కరోనా వైరస్ ఎటాక్ చేసిన తర్వాత కూడా కొంతమందికి COVID-19 ఎందుకు రాదననే విషయాన్ని వెల్లడించింది. పరిశోధకులు మొదటిసారిగా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. SARS-CoV-2 యొక్క ప్రీ-ఆల్ఫా స్ట్రెయిన్‌ని ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు సోకేలా చేసి పరిశోధన నిర్వహించారు.
Read Also: Viral Video: సబ్బు పై కాలేయడంతో మూడో అంతస్థు మీదనుండి జారిపడ్డ మహిళ.. చివరకు..?
వ్యాధి సోకిన వారితో పోలిస్తే, ఇన్ఫెక్షన్‌ని నిరోధించే వ్యక్తుల్లో ముక్కులోని కణజాలం వేగంగా రోగనిరోధక ప్రతిస్పందన కలిగి ఉంటున్నారని తేలింది. వైరస్‌ని గుర్తించిన వెంటనే అది తీవ్రంగా మారేలోపే ముక్కులోని శ్లేష్మ-సంబంధిత T (MAIT) కణాల క్రియాశీలత పెరగడం, ఇన్‌ఫ్లమేటరీ తెల్ల రక్త కణాల తగ్గుదల నమోదై, ఇది వైరస్‌ని నాశనం చేస్తున్నట్లు తేలింది. ఇన్ఫెక్షన్‌ను నిరోధించే వ్యక్తులు నాసికా కణాలలో HLA-DQA2 అనే జన్యువు యొక్క అధిక పనితీరు కలిగి ఉంటారని అధ్యయనం కనుగొంది.
ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని ఇన్ఫెక్షియస్ డిసీజ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ క్రిస్టోఫర్ చియు ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. ఈ పరిశోధనతో మన రోగనిరోధక వ్యవస్థ కొందరిలో ఎలా వైరస్‌ని ఎదుర్కొంటుందనే దానిని తెలియజేసిందని చెప్పారు. ఈ సహజ రక్షణను అనుసరించి కొత్త చికిత్సలు, వాక్సిన్లను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన ఒక ఆధారాన్ని అందిస్తుందని చెప్పారు.