Oral sex causes throat cancer: ఓరల్ సెక్స్ పద్ధతులు గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా అమెరికా, యూకే దేశాల్లో ఈ రకం క్యాన్సర్లు ఎక్కువగా పెరుగుతున్నట్లు తేలింది. ఈ రెండు దేశాల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్(సర్వికల్ క్యాన్సర్) ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో గొంతు క్యాన్సర్ల సంఖ్య పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్(హెచ్పీవీ) గర్భాశయ క్యాన్సర్లకు ప్రధాన కారణంగా ఉంటుందని బర్మింగ్ హామ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ హిషామ్ మెహన్నా జర్నల్ లో రాశారు.
హెచ్ పీ వీ అనేది సాధారణ వైరస్. ఈ వైరస్ ఉన్నవారి నుంచి యోని, అంగం, నోటి ద్వారా సెక్స్ చేస్తే ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. ఓరల్ సెక్స్ అనేది ఓరోఫారింజియల్ క్యాన్సర్ అని పిలువబడే ఓ రకమైన గొంతు క్యాన్సర్ పెరుగుదలకు కారణం అవుతోందని, ఇది టాన్సిల్స్, గొంతు వెనకభాగాన్ని ప్రభావితం చేస్తోందని అధ్యయనంలో తేలింది. గత రెండు దశాబ్దాలుగా, పాశ్చాత్య దేశాలలో గొంతు క్యాన్సర్ వేగంగా పెరుగుతోంది, దీనిని కొందరు అంటువ్యాధిగా కూడా పిలుస్తున్నారని డాక్టర్ మెహన్నా పేర్కొన్నారు.
Read Also: Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
గతంలో జరిగిన అధ్యయనాలు హెచ్ పీ వీ సంక్రమణ వ్యాధిని అభివృద్ధి చేయడానికి అతిపెద్ద కారకంగా సూచించాయని, హెచ్ పీ వీ లైంగికంగా సంక్రమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఓరోఫారింజియల్ క్యాన్సర్ కు జీవిత కాలంలో సెక్స్ పార్ట్నర్ల సంఖ్య, ఓరల్ సెక్స్ ప్రధాన కారణం అని తేలింది. 6 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఓరల్ సెక్స్ భాగస్వాములు ఉన్నవారిలో, ఓరల్ సెక్స్ చేయని వారిలో కన్నా ఓరోఫారింజియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం 8.5 రెట్లు అధికంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
అమెరికా ఆరోగ్య సంస్థ, నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం, యూకేలో ప్రతీ ఏడాది సుమారుగా 8,300 మంది గొంతు క్యాన్సర్లతో బాధపడుతున్నారని, ఇది 50 క్యాన్సర్లలో ఒకటిగా నిర్థారణ అయిందని తెలిపింది. ఓరల్ సెక్స్ వల్ల గొంతు వెనక భాగం టాన్సిల్స్ దగ్గర HPV ఇన్ఫెక్షన్ సోకుతుందని, ఇది కొన్ని సందర్భాల్లో దానంతట అదే తగ్గిపోతుందని, కొన్ని సార్లు మాత్రం క్యాన్సర్ కు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. హెచ్ పీ వీకి వ్యాక్సిన్ ఉంది. మహిళలు ఇది తీసుకుంటే సర్వికల్ కాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు.