గర్భిణులకు పోషకాహారం చాలా చాలా అవసరం. ఎందుకంటే గర్భంలో బిడ్డ శారీరక ఎదుగుదల, ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా పోషకాహారాన్ని తింటూ ఉండాలి. రోజూ మీరు తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఏం తిన్నా అది మీ బిడ్డను కూడా ప్రభావితం చేస్తుందని తప్పక గుర్తుంచుకోవాలి. అందుకే ఈ సమయంలో ఆహారం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పుట్టబోయే పిల్లలకు గుండెజబ్బు రాకుండా ఉండాలంటే పలు ఆహార పదార్థాలు తినాలని వైద్యులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
READ MORE: pimples: ఈ రకం చేపలు తింటే మొటిమలు మాయం..!
గర్భిణులు తినే ఆహారం, వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యం మీదా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని మోనాష్ యూనివర్సిటీ అధ్యయనం మరోసారి నొక్కి చెప్పింది. గర్భిణులు ఎక్కువ పీచుతో కూడిన ఆహారం తింటే వారికి పుట్టబోయే పిల్లలకు గుండెజబ్బు ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాల్లోని పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తల్లికే కాకుండా పిల్లల గుండె ఆరోగ్యాన్నీ నిర్ణయిస్తున్నట్టు తేలటం గమనార్హం. పేగుల్లో మేలు చేసే షార్ట్ చెయిన్ కొవ్వు ఆమ్లాలు (ఎస్‌ఎప్‌ఏస్) పుట్టుకొచ్చేలా పీచు ప్రోత్సహిస్తుంది. ఇవి తల్లి రక్తం ద్వారా ప్రయాణించి, మాయను దాటుకొని పిండంలో జన్యు పనితీరును ప్రభావితం చేస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం చిన్న వయసులోనే పిల్లలు గుండె జబ్బు బారిన పడుతున్న ఎన్నో కథనాలను మనం చూస్తునే ఉన్నాం. తల్లులు ముందుగానే ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు ముప్పు తప్పుతుంది. తప్పక పాటించండి.