Diabetes: ప్రపంచవ్యాప్తంగా టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం వయసు మీద పడినవారికి మాత్రమే షుగర్ వ్యాధి వస్తుందని అనుకునే వాళ్లం, కానీ ప్రస్తుత జీవనశైలి కారణంగా 30 ఏళ్ల లోపు యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది.
అయితే తీపి పదార్థాలు ఎక్కువగా తింటే మనం షుగర్ వస్తుందని అనుకుంటాం. షుగర్ వ్యాధికి మరో పదార్థం కూడా కారణమవుతోందని తాజా అధ్యయనంలో తేలింది. అధిక ఉప్పు వినియోగం కూడా టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు దోహదం చేస్తుందని ఒక అధ్యయనం తెలిపింది. తులనే యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరిశోధన మాయో క్లినిక్ ప్రొసీడింగ్స్ లో ప్రచురించబడింది. యూకే బయోబ్యాంకులో నమోదైన 4,00,000 కంటే ఎక్కువ మంది పెద్దల ఉప్పు తీసుకునే అలవాట్లపై అధ్యయనం దృష్టిసారించింది.
Read Also: PM Modi: “కాంగ్రెస్, అభివృద్ధి కలిసి ఉండవు”.. ప్రధాని విమర్శలు..
11.8 సంవత్సరాల సగటు ఫాలో-అప్ వ్యవధిలో సర్వేలో పాల్గొన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ కేసులు 13,000 కంటే ఎక్కువగా నమోదయ్యాయని గుర్తించారు. ఉప్పును తీసుకోని, అరుదుగా తీసుకునే వారితో పోలిస్తే, కొన్నిసార్లు తీసుకునే వ్యక్తుల్లో 13 శాతం, సాధారణంగా తీసుకునే వారిలో 20 శాతం, ఎల్లప్పుడూ తీసుకునే వారిలో 39 శాతం టైప్ 2 డయాబెటిస్ వచ్చినట్లుగా అధ్యయనం పేర్కొంది.
ఈ అధ్యయనం యొక్క ప్రధాన రచయిత డాక్టర్ లూ కీ మాట్లాడుతూ.. ఉప్పును పరిమితంగా తీసుకుంటే హృదయసంబంధ వ్యాధులు, బీపీ వంటి ప్రమాదాలను తగ్గించవచ్చని తెలుసు, కానీ ఇప్పుడు డయాబెటిక్ రావడానికి కూడా ఇది ప్రముఖ పాత్ర పోషిస్తోందని నిరూపితమైందని అన్నారు. అయితే ఇది ఎలా టైప్ 2 డయాబెటిస్ కి కారణమవుతుందో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమన్నారు.