ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం అందరికి తెలుసు. ఎప్పుడూ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటించాల్సిందే. అలా ఆరోగ్యంగా ఉంచే, ఎప్పుడూ మన వంట గదిలో లభించే వాము వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? వాము మంచి ఔషధపు మొక్క. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అలాగే మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గొచ్చు. ఒక స్పూన్ వాము తినడం వలన మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి రకరకాల ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి.
Read Also : భారత హాకీజట్టుకు తారల అభినందనలు
వాములో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వాములో ఉండే తైమల్ అనే రసాయనం బాక్టీరియాను, ఫంగల్ వ్యాధులను నివారిస్తుంది. తలనొప్పి, మైగ్రేన్, అలసటకు వాము ఔషధంగా పని చేస్తుంది. వామును ప్రతి రోజూ ఆహారంలో చేర్చుకోవడం వలన అజీర్తి, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. వాము నుంచి తీసిన నూనెను కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు ఉన్నవాళ్లు రాసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. వాము రసంలో కొంచం పసుపు, తేనే కలిపి తీసుకోవడం వల్ల జలుబు, కఫము తగ్గిపోతుంది. ఒక టీ స్పూన్ వామును ఒక గ్లాసు నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టి, పొద్దున్నే మరిగించి, చల్లార్చి తీసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే బరువు తగ్గుతారు.