మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు రోజుకు 7 నుండి 9 గంటల నిద్ర తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమే. అయితే ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎంత ప్రయత్నించినా సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రోజూ 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతే శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.
అయితే నిద్రలేమి మెదడు పనితీరును ప్రభావితం చేసి ఆలోచనా శక్తిని మందగింపజేస్తుంది. అంతేకాకుండా ఇది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసి ముఖంపై ముడతలు, నల్ల వలయాలు పెరిగే అవకాశాలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం హార్మోన్ల అసమతుల్యతకు దారితీసి కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. దీని ఫలితంగా ఆందోళన, చిరాకు, రక్తపోటు పెరుగుదల వంటి సమస్యలు ఎదురవుతాయి. రోజుకు ఆరు గంటలకంటే తక్కువ నిద్రపోతే ఇన్సులిన్ స్థాయిలు దెబ్బతిని దీర్ఘకాలంలో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
అయితే.. తగినంత నిద్ర లేకపోవడం శరీరాన్ని సులభంగా అలసటకు గురిచేసి మరెన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి శారీరకంగా ఆరోగ్యంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ప్రతీ రోజు కనీసం 7–8 గంటల నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ వివరాలు వాటి మూలాల ఆధారంగా సేకరించబడినవి. మీ ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి.