ప్రస్తుత బిజీలైఫ్ లో చాలా మంది ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టడం లేదు. అయితే ఆరోగ్య నిపుణులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకూడా నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రోటీన్ యుక్తమైన ఆహారం, శారీరక వ్యాయామం, రోజూ కనీసం 8 గంటల నిద్ర పోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ చాలామంది రాత్రివేళ మొబైల్‌లో రీల్స్ చూస్తూ సమయం గడపడం వల్ల నిద్రలేమితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.
అయితే.. కొందరు రాత్రి గాఢ నిద్రలో ఉండగా ఆకస్మికంగా ఉలిక్కిపడి మేల్కొనే పరిస్థితులు ఎదుర్కొంటారు. ప్రతి 1–2 గంటలకు ఇలా మెలకువ రావడం తీవ్రమైన సమస్యకు సంకేతమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలో హఠాత్తుగా మేల్కొనడం అధిక ఒత్తిడికి (స్ట్రెస్) ప్రధాన సూచిక అని చెప్పారు. శరీరంలోని ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ హార్మోన్ అసాధారణంగా పెరిగితే రాత్రిపూట మెలకువ రావడం సహజమని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
అర్థరాత్రి 1–2 గంటలకు మేల్కొన్న తర్వాత మళ్లీ నిద్ర పడలేకపోతే మీరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లు అర్థం. ఇది కేవలం మానసిక సమస్య మాత్రమే కాదు, శారీరకంగా కూడా ప్రమాదకరమే. నాడీ వ్యవస్థలో అసమతౌల్యం ఉన్నట్లు ఇది సూచిస్తుందని అన్నారు. రాత్రివేళ మీ శరీరం పారాసింపథెటిక్ స్థితిలో ఉండాలి; అదే ఒత్తిడిని తగ్గించి శరీరం విశ్రాంతి పొందేలా చేస్తుంది. ఈ సమాచారాన్ని మేము ఇంటర్నెట్ వనరుల నుంచి సేకరించాము. మీకు ఈ సమస్యలపై ఎటువంటి సందేహాలు లేదా ఇబ్బందులు ఉంటే, తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.