Diaper Changing Tips: కొత్తగా తల్లిదండ్రులైన వారి జీవితంలో పిల్లలతో పాటు డైపర్లు కూడా భాగం అయ్యాయి. చిన్నారులను ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే కచ్చితంగా వారితో పాటు డైపర్లు అనేవి ముఖ్యంగా తీసుకెళ్లాల్సిందే. ఈ రోజుల్లో డైపర్లు లేకపోతే ప్రయాణాలు కూడా ఉండవు అనే స్థితికి వెళ్లిపోయింది. ఇంతలా చిన్నారుల జీవితంలోకి చొచ్చుకెళ్లిన డైపర్లు.. వారికి మంచే చేస్తాయా.. వాటితో పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదా అంటే… దానికి సమాధానాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: CM Revanth Reddy : ఇంకా వరద ముప్పు పోలేదు. అప్రమత్తంగా ఉండాల్సిందే
డాక్టర్లు ఏమంటున్నారు అంటే..
ప్రస్తుతం డైపర్లు అనేవి పసిపిల్లల సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగమయ్యాయి. ఆధునిక కాలంలో తల్లిదండ్రులు పిల్లల కోసం డైపర్ల వినియోగించడం పెరిగింది. కానీ వీటిని సరిగ్గా వినియోగించుకోకపోతే చిన్నారులకు ర్యాషెస్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు డైపర్ విరామం పాటించడం, ఎప్పటికప్పుడు వాటిని మారుస్తుండటం, గాలి తగిలే, తేమ ఉండని నాణ్యమైన డైపర్లు వినియోగించడంతో ఈ సమస్యలను నివారించవచ్చని సూచిస్తున్నారు. సాధారణంగా 18 నుంచి 20 నెలల వయసు వచ్చే వరకు పిల్లలకు డైపర్లు వాడొచ్చని, గరిష్ఠంగా 2 ఏళ్ల వరకు వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. డైపర్లు గంటల కొద్దీ మార్చకుండా అలా ఉంచేస్తే చిన్నారులకు ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాడినవే మళ్లీ మళ్లీ వాడినా శరీరం ఒరుసుకుపోతుందని, దురదలు, దద్దుర్లు వస్తాయని తెలిపారు. వీటిని మార్చకుండా అలానే వదిలేస్తే మూత్రం అక్కడ నిల్వ ఉండి గజ్జలకు పుళ్లు పడే ప్రమాదమూ ఉంటుందన్నారు. కాటన్ డైపర్లు మంచివని, డిస్పోజబుల్ డైపర్లు ప్రయాణాల సమయంలో వాడవచ్చని తెలిపారు. ప్రత్యేకంగా మూడు గంటలకోసారి డైపర్లను మార్చాల్సి ఉంటుందన్నారు.
పలువురు చిన్న పిల్లల వైద్య నిపుణులు మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు డైపర్ విప్పి మళ్లీ వెంటనే వేయకూడదని, కొంతసేపు విరామం ఇవ్వాలన్నారు. దాని వల్ల అవయవాలకు గాలి తగులుతుందని, మార్చినప్పుడల్లా వేడినీళ్లతో కడిగేసి సున్నితంగా కాటన్ బట్టతో అద్దాలన్నారు. దద్దుర్లు రాకుండా సంబంధిత క్రీమ్ రాయాలని, పిల్లలకు కాటన్ డైపర్లు మంచివని అన్నారు. డైపర్లు మరీ లూజ్‌గా, మరీ బిగుతుగా ఉండకూడదన్నారు. డయేరియాతో బాధపడే చిన్నారుల్లో మూత్రం పరిమాణం, రంగును బట్టి డయేరియా తీవ్రత అంచనా వేయాల్సి ఉంటుందన్నారు. డైపర్ల వినియోగం కారణంగా అది గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. చికిత్సలో సమస్యలు వస్తున్నాయని, డీహైడ్రేషన్ ఎంత వరకు ఉందో గుర్తించడం సమస్య అవుతోందన్నారు. కచ్చితంగా పిల్లలకు 2 ఏళ్లు వచ్చిన తర్వాత డైపర్లు ఆపేయాలని స్పష్టం చేశారు. లేకపోతే వారికి సమయానికి మూత్రం వచ్చే అలవాటు పోతుందన్నారు.
READ ALSO: YS Jagan : ఫ్రీ బస్సు హామీ ఇచ్చి, దాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదు
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.