Dandruff Remedies: ఆహ్లాదకరంగా గడపడానికి శీతాకాలం ఎంతో అనువైన సమయం. కానీ.. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అనేక సమస్యలు కూడా వేధిస్తుంటాయి. వాస్తవానికి ఈ సమయంలో అనేక చర్మ సంబంధిత సమస్యలు పెద్ద ఆందోళన కలిగిస్తాయి. చల్లని గాలుల కారణంగా చర్మం, జుట్టు తేమను కోల్పోతాయి. దీంతో జుట్టు పొడిబారి చుండ్రు సమస్య వేధిస్తుంది. ఈ సమస్యను వదిలించుకోవడానికి ప్రజలు చాలా ఖరీదైన చికిత్సలను ఆశ్రయిస్తారు. కానీ అవి తరచుగా దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వడంలో విఫలమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ఈ 5 నేచురల్ టిప్స్ ఫాలో అయితే డ్యాండ్రఫ్ జాడ కూడా కనిపించదని చెబుతున్నారు. ఆ టిప్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Pinaka Mk4 Missile: ఇక ఇస్లామాబాద్ వణకాల్సిందే – కరాచీ దద్దరిల్లాల్సిందే.. భారత ఆయుధామా మజాకా
1. వేప ఆకులు
ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. వేప ఆకులు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయని అన్నారు. ఇవి చుండ్రును తొలగించడానికి విశేషంగా ఉపయోగపడుతాయని చెప్పారు. వేప ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటితో జుట్టును క్రమం తప్పకుండా కడగాలని, లేదంటే వేప ఆకులను పెరుగుతో కలిపి తలకు అప్లై చేసుకోవాలని వైద్యులు సూచించారు. ఇలా చేసిన కొన్ని రోజుల్లోనే దీని ప్రయోజనాలను చూస్తారని చెప్పారు.
2. మెంతి గింజలు
చుండ్రును తొలగించడానికి మెంతులు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయని చెబుతున్నారు. మెంతులను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు వాటిని మెత్తగా పేస్ట్ లా చేసుకొని ఆ పేస్ట్‌ను పెరుగుతో కలిపి, 1 టీస్పూన్ త్రిఫల పొడిని కలపి, ఆ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, 1 గంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చుండ్రు వెంటనే తొలగిపోతుందని చెబుతున్నారు.
3. కొబ్బరి నూనె, నిమ్మరసం
2 టీస్పూన్ల కొబ్బరి నూనెను బాగా వేడి చేసి, దీనికి ఒక1 టీస్పూన్ నిమ్మరసం కలిపి ఆ నూనెను తలకు బాగా రాయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా వారానికి ఒకసారి చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయని చెబుతున్నారు. కొబ్బరి నూనె తలకు తేమను అందిస్తుందని, అలాగే నిమ్మకాయలోని విటమిన్ సి చుండ్రుతో పోరాడటానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.
4. కలబంద
చుండ్రును తొలగించడానికి అత్యంత సాధారణమైన ఇంటి నివారణ చిట్కాగా నిపుణులు కలబందను సూచిస్తున్నారు. 1 కప్పు కలబంద జెల్‌ను 2 టీస్పూన్ల ఆముదంతో బాగా కలిపిన తర్వాత, పడుకునే ముందు జుట్టుకు అప్లై చేసి ఉదయం శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని వెల్లడించారు. ఇది తల దురద నుంచి ఉపశమనం పొందటానికి కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు.
5. ఉరిసి
ఆమ్లాలో విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రును తొలగించడంలో విశేషంగా సహాయపడతాయని పలువురు నిపుణులు వెల్లడించారు. దీని కోసం 2 టీస్పూన్ల ఆమ్లా పౌడర్, 2 టీస్పూన్ల తులసి ఆకులను నీటితో కలిపి జుట్టు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలని సూచించారు. కొన్ని రోజుల్లోనే దీని ప్రయోజనాలను చూస్తారని చెప్పారు.
నోట్: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించండి.
READ ALSO: Tilak Varma Record: తొలి భారత బ్యాట్స్‌మన్‌గా తిలక్ వర్మ రేర్ రికార్డు!