Schengen Visas: భారత పర్యాటక గ్రూపులకు ఇచ్చే స్కెంజెన్ వీసాలను నిలిపివేయలేదని భారత్‌లోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఐరోపా సమాఖ్య దేశాల్లో వీసా ఆంక్షలు లేకుండా పర్యటించేందుకు జారీచేసే వీసాల అపాయింట్‌మెంట్‌లు అక్టోబర్ వరకు నిలిపివేశారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా భారత్‌లోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం స్పందించింది. భారత పర్యాటక గ్రూపులకు స్కెంజెన్ వీసాలను నిలిపివేయలేదని.. కొవిడ్ కంటే ముందుస్థాయిని దాటిందని స్పష్టం చేసింది. భారత్-స్విస్ పౌరుల మధ్య బంధం ఎంతో ప్రధానమైందని అభిప్రాయపడింది.
Read also: WhatsApp Ban: షాకిచ్చిన వాట్సాప్… లక్షల్లో ఇండియన్స్ అకౌంట్స్ బ్యాన్
భారత పర్యాటక బృందాలకు వీసా అపాయింట్‌మెంట్లను భారత్‌లోని స్విట్జర్లాండ్ ఎంబసీ నిలిపివేయలేదు. సెప్టెంబర్ 2023 వరకు నిత్యం దాదాపు 800 అపాయింట్‌మెంట్‌లు ఉన్నాయి. ఇందులో 22 బృందాలు ఉన్నాయి. 2019తో పోలిస్తే 2023లో ఇప్పటివరకు అత్యధిక వీసాలను జారీ చేశాం. జనవరి నుంచి జూన్ వరకు 1.29లక్షల దరఖాస్తులను పరిశీలించాం. కొవిడ్ ముందుతో పోలిస్తే 7.8శాతం ఎక్కువ’ అని పేర్కొంటూ భారత్‌లోని స్విట్జర్లాండ్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘భారతీయుల వీసాల ప్రక్రియను ఈ ఏడాది మరింత సులభతరం చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నాం. ప్రయాణానికి ఆరు నెలల ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఇది కేవలం నెల మాత్రమే ఉండేది. లక్నోలో దరఖాస్తు కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తాం. దీంతో భారత్‌లో ఈ కేంద్రాల సంఖ్య 13కు చేరుకుంటుంది. అంతేకాకుండా తమ భాగస్వామ్య విభాగం వీఎఫ్‌ఎస్ నుంచి దరఖాస్తు వచ్చిన తర్వాత గరిష్ఠంగా 13రోజుల్లోనే వీసాపై ఎంబసీ నిర్ణయం వెలువడుతుంది’ అని పేర్కొంటూ భారత్‌లోని స్విస్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఐరోపా దేశాల మధ్య 90 రోజుల వరకు పర్యటించేందుకు వీలుగా స్కెంజెన్ వీసా లను జారీ చేస్తుంటారు. ఏదైనా సభ్యదేశం దీనిని జారీ చేస్తే.. దానిపై ఇతర ఈయూ దేశాల్లో పర్యటించేందుకు కూడా అనుమతి లభిస్తుంది.