Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఒక్క పంజాబ్ మినహా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ఇలా పలు ప్రాంతాల్లో ప్రజలు పాక్ నుంచి స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావాలనే డిమాండ్లు ఉన్నాయి. తాజాగా, సింధ్ ప్రావిన్సులో ప్రత్యేక ‘‘సింధుదేశ్’’ను డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసలు చేశారు. కరాచీలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. రాళ్లదాడి, విధ్వంసం, పోలీసులతో తీవ్రమైన దాడి జరిగింది. సింధి సంస్కృతి దినోత్సవం నాడు నిరసనకారులు వీధుల్లోకి వచ్చిన తర్వాత ఆదివారం హింస ప్రారంభమైంది. జియే సింధ్ ముత్తహిదా మహాజ్ (JSSM) బ్యానర్ కింద సింధీల పెద్ద ఎత్తున స్వేచ్ఛ కావాలని, ‘‘పాకిస్తాన్ ముర్దాబాద్’’ నినాదాలు చేశారు. సింధ్ విముక్తి కోసం పిలుపునిచ్చారు.
సింధు నదికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంతో 1947 విభజనకు ముందు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. ఆ తర్వాత పాకిస్తాన్‌లో చేరింది. ఇప్పుడు ఈ ప్రాంతంలోని ప్రజలు, పాక్ పంజాబీల అణిచివేత, దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు స్వతంత్ర దేశం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం, నిరసనకారుల ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించింది. ఈ ఆందోళనకు సంబంధించి 45 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Microsoft: భారత్‌లో మైక్రోసాఫ్ట్ రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడి.. పీఎం మోడీతో సత్య నాదెళ్ల భేటీ..
ఐక్యరాజ్యసమితి, ప్రధాని మోడీలకు విజ్ఞప్తి
చాలా కాలంగా ఈ ప్రాంతంలోని సింధీలపై రాజకీయ అణిచివేత, మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రజలు సింధుదేశ్‌ని డిమాండ్ చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని సింధు దేశ్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని JSSM చైర్‌పర్సన్ షఫీ బర్ఫత్ అన్నారు. సింధ్, భారత్ మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ఉటంకిస్తూ.. ప్రధాని నరేంద్రమోడీ కూడా తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. పాక్ భద్రతా బలగాలు సింధ్‌లో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని, బలవంతపు అదృశ్యాలు, హింస, కార్యకర్తల్ని, జర్నలిస్టుల్ని చట్టవిరుద్ధంగా హత్య చేస్తున్నారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
1971 నాటి డిమాండ్
సింధ్ ప్రావిన్సు, భారతదేశంలో కలవాలని డిమాండ్ లేదు కానీ తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలనే డిమాండ్ మాత్రం ఉంది. బ్రిటీష్ ఇండియాలో సింధ్ విలీనం కావడానికి ముందు సింధ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా ఉంది. 1936 వరకు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది, ఆ తర్వాత భారత విభజన జరిగే 1947 వరకు ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా ఉంది. విభజన తర్వాత ఇది పాకిస్తాన్ లో భాగమైంది. స్వతంత్ర దేశానికి మద్దతుగా జీఎం సయ్యద్, పిర్ అలీ మొహమ్మద్ రష్ది నాయకత్వంలో 1967లో ప్రత్యేక సింధ్ దేశ్ డిమాండ్ ప్రారంభమైంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి తర్వాత, ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది.