Trump vs Democrats: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన భారీ టారిఫ్‌లకు వ్యతిరేకంగా యూఎస్ లో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగుతుంది. ఈ టారిఫ్‌లపై బహిరంగంగా విమర్శలు చేస్తూ డెమోక్రటిక్ ఎంపీలు ఆందోళనకు దిగారు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యులు డెబోరా రాస్ (నార్త్ కరోలినా), మార్క్ వీజీ (టెక్సాస్) భారతీయ మూలాల ఎంపీ రాజా కృష్ణమూర్తి (ఇల్లినాయిస్) కలిసి ఓ ప్రతిపాదనను ప్రవేశ పెట్టారు. భారతీయ దిగుమతులపై 50 శాతం వరకు విధించిన టారిఫ్‌లను రద్దు చేయాలని ఈ ప్రతిపాదనలో వారు డిమాండ్ చేశారు.
అయితే, ఈ ముగ్గురు ఎంపీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో.. ట్రంప్ విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమని, అమెరికా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమని, చివరికి దీని భారాన్ని మోయాల్సి వస్తున్నది సామాన్య అమెరికన్లేనని విమర్శించారు. యూఎస్ ప్రజల రోజువారీ అవసరాలపై అదనపు భారంగా మారాయని పేర్కొన్నారు. ట్రంప్ 2025 ఆగస్టు 1వ తేదీన భారత్‌పై 25 శాతం సుంకాలు విధించగా, ఆగస్టు 27న రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందదన్న కారణంతో మరో 25 శాతం ‘సెకండరీ టారిఫ్‌లు వేశారు. దీంతో ఇప్పటికే ఉన్న రిసిప్రోకల్ పన్నులకు ఇది అదనంగా చేరి, అనేక భారతీయ ఉత్పత్తులపై దిగుమతి ఖర్చులు దాదాపు రెట్టింపు అయ్యాయి.
Read Also: Temperatures Drop: ఏజెన్సీలో చలి పంజా.. మంచు ఎఫెక్ట్‌తో రాకపోకలు నిలిపివేత..
ఇక, భారత్ ఇంకా రష్యా చమురు కొనుగోలు చేస్తోంది.. దాని ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి మాస్కోకు నిధులు అందుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ తన పన్ను విధానానికి మద్దత్తు కూడగట్టుకున్నాడు. ఈ నిర్ణయాలను అమలు చేయడానికి ఆయన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (IEEPA)ను ఉపయోగించారు. అయితే, దీనిపై డెమోక్రటిక్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డెబోరా రాస్ మాట్లాడుతూ.. నార్త్ కరోలినాలో భారత్ తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి.. అక్కడి కంపెనీలు ఇక్కడ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాయని చెప్పారు. ఇలాంటి టారిఫ్‌లు ఆ బంధాలను తీవ్రంగా దెబ్బ తీస్తాయని హెచ్చరించారు. మార్క్ వీజీ మాట్లాడుతూ, ఈ అక్రమ టారిఫ్‌లు ఉత్తర టెక్సాస్‌లో సాధారణ ప్రజలపై ద్రవ్యోల్బణ భారాన్ని మోపుతున్నాయని ఆరోపించింది. భారత్ అమెరికాకు సాంస్కృతిక, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామి అని గుర్తు చేశారు. రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఈ టారిఫ్‌లు సరఫరా గొలుసులను దెబ్బ తీస్తున్నాయి.. అమెరికన్ కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయి, వినియోగదారుల జేబులపై భారం మోపుతున్నాయని విమర్శించారు. టారిఫ్‌లు ఎత్తివేస్తే భారత్- అమెరికా ఆర్థిక, భద్రతా సంబంధాలు మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు.
Read Also: Dhurandhar : బాలీవుడ్ ‘ధురంధర్’ సినిమాపై .. పుష్ప రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కాగా, ట్రంప్- అమెరికన్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న ఈ పోరు ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. డెమోక్రట్స్‌తో పాటు కొంతమంది రిపబ్లికన్లు కూడా అధ్యక్షుడు ట్రంప్ అత్యవసర అధికారాలకు పరిమితులు విధించాలనే అభిప్రాయంతో ఉన్నారు. వాణిజ్య విధానాలు రూపొందించే అధికారం రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్‌కే ఉంది.. అధ్యక్షుడికి కాదని వారు స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన ఇప్పటికే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ప్రవేశ పెట్టారు. ఇది అక్కడ ఆమోదం పొందితే, సెనేట్‌లో కూడా ఇలాంటి బిల్లుపై ఓటింగ్ జరగనుంది. ప్రత్యేక మెజారిటీ లభిస్తే అధ్యక్షుడి వీటోను కూడా తిరస్కరించే అవకాశం ఉందని అమెరికా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.