Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌కి అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. సోమవారం యూఎస్ కాంగ్రెస్‌లో జో విల్సన్ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. మాజీ సెనెటర్ తన ఫిబ్రవరి డిక్లరేషన్‌లో, సోమవారం అమెరికన్ పార్లమెంట్‌లో ‘‘పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్’’ని తీసుకువచ్చారు. ఈ బిల్లు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహా రాజకీయ ప్రత్యర్థులందర్ని హింసించడంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రధాన పాత్ర ఉందని ఆరోపించింది. అతడిపై ఆంక్షలు విధించాలని బిల్లులో కోరారు. గ్లోబల్ మాగ్నిట్స్కీ మానవ హక్కుల జవాబుదారీతనం చట్టం కింద అతడిపై ఆంక్షలు విధించాలని అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన బిల్లు పిలుపునిచ్చింది. పాకిస్తాన్‌లో రాజకీయ హింసకు పాల్పడిన వ్యక్తులను 180 రోజుల్లో గుర్తించి, వీసా నిషేధాలు, అమెరికాలో ప్రవేశించడంపై పరిమితులు, జరిమానాలు విధించాలని బిల్లు కోరుతోంది.
Read Also: Delhi Capitals: అరంగేట్రం అంటే ఇలా ఉండాలి.. తొలి మ్యాచ్‌లోనే
2012లో రష్యాని లక్ష్యంగా చేసుకుని అప్పటి బరాక్ ఒబామా ప్రభుత్వం గ్లోబల్ మాగ్నిట్న్కీ చట్టాన్ని రూపొందించింది. ఆసిమ్ మునీర్ రాజకీయ ప్రత్యర్థుల్ని హింసకు గురిచేయడం, జైలులో పెట్టడం వంటి చర్యలకు పాల్పడ్డాడని ఆరోపించింది. పాకిస్తాన్ సైనిక పాలన ముగించి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, నిర్భంధించబడిన అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను విడుదల చేస్తే ఆంక్షలు తొలగించడానికి బిల్లు అనుమతిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షపై విల్సన్ తన వైఖరిని చెప్పాడు. అతడిని రాజకీయంగా నిర్భంధించారని అన్నారు.
2022లో అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ని అధికారం నుంచి తొలగించారు. ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్ ప్రధాని పదవిని దక్కించుకున్నారు. 2023లో ఇమ్రాన్ ఖాన్‌పై అవినీతి ఆరోపణలు మోపి, జైలుకి పంపారు. తాను అధికారంలోకి రాకుండా కావాలనే పాక్ సైన్యం కుట్ర పన్నిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అప్పటి జోబైడెన్ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు.