ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలను మోహరించగా, ఉక్రెయిన్‌కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు మోహరించాయి. ఉక్రెయిన్ ను అక్రమించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. అయితే, రష్యాకూడా ఇదే విధంగా చెబున్నది. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, సోవియట్ యూనియన్ ఒప్పందాలకు విరుద్దంగా నాటో దేశాలు, అమెరికా ప్రవర్తిస్తే తగిన చర్యలు తీసుకుంటామని రష్యా హెచ్చరించింది. ఈ సమస్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఫ్రాన్స్, జర్మనీలు రంగంలోకి దిగాయి.
Read: నేపాల్ భూభాగంపై కన్నేసిన చైనా…
ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే చర్చలు జరిపారు. పుతిన్ తో చర్చలు జరిపే ముందురోజు మెక్రాన్ అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిపారు. రక్షణ విషయంలో పుతిన్ అనుమానాలను నివృత్తి చేస్తామని మెక్రాన్ పేర్కొన్నారు. ఇక త్వరలోనే ఫ్రాన్స్, జర్మనీ అధ్యక్షులు ఉక్రెయిన్, రష్యాలతో చర్చలు జరిపే అవకాశం ఉన్నది. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తలు త్వరలోనే తగ్గిపోతాయని అంటోంది ఫ్రాన్స్. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం స్వయంప్రతిపత్తి విషయంపై స్పష్టత వస్తేనే చర్చలు సఫలం అవుతాయని రష్యా పేర్కొన్నది.