Typhoon Nanmadol: జపాన్ దేశాన్ని అత్యంత శక్తివంతమైన తుఫాన్ నన్మదోల్ భయపెడుతోంది. తీరం వైపు వేగంగా దూసుకువస్తుండటంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. తీర ప్రాంతాల్లో జనాలను సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. నన్మదోల్ టైఫూన్ వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో రవాణా సేవలు స్తంభించాయి. నైరుతి జపాన్ లోని కగోషిమా ప్రిపెక్చర్ లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో భారీగా గాలులు వీస్తున్నాయి. దీంతో పాటు సముద్రంలో ఎతైన అలలు వస్తున్నాయి. ఉప్పెన వచ్చే ప్రమాదం ఉందని జపాన్ వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Earthquake: తైవాన్ తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన జపాన్
కొన్ని దశాబ్ధాలకు ఒకసారి ఇలాంటి శక్తివంతమైన టైఫూన్లు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ఉత్తర, దక్షిణ క్యూషు, అమామి దీవులలో గంటకు 252 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి 24 గంటల పాటు దక్షిణ క్యుషులో 600 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు అంచానా వేస్తున్నారు. శక్తివంతమైన టైఫూన్ కావడంతో తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. తుఫాను ఈశాన్య దిశగా పయణిస్తోందని.. మంగళవారం వరకు జపాన్ ప్రధాన ద్వీపం హెన్షును తాకుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో తీర ప్రాంతంలో ఉన్న 20 లక్షల మంది జనాభాను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు కోరారు.
తుఫాన్ ప్రభావం వల్ల జపాన్ వ్యాప్తంగా జపాన్ ఎయిర్‌లైన్స్, ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ రోజుకు 500 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేశాయి. ప్రధానంగా క్యుషు, షికో ప్రాంతాల్లోని విమానాశ్రయాలు మూతపడ్డాయి. బుల్లెట్ రైళ్లపై కూడా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. షింకన్ సెన్ బుల్లెట్ రైళ్లను నిలిపివేశారు. సముద్రతీర నగరాలైన మియాజాకి, కగోషిమా, అమకుసాలో 9,65,000 గృహాల్లోని నివాసితులు ఖాళీ చేయవలసిందిగా అధికారులు ఆదేశించబడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగే పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.