Earthquake Hits Taiwan: తైవాన్ తీరం ఉలిక్కిపడింది. ఆదివారం తైవాన్ ఆగ్నేయ తీరంలో భారీ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. టైటుంగ్ నగరానికి ఉత్తరాన 50 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం కేంద్రీకృతం అయిందని తెలిపింది. రిక్టర్ స్కేల్ పై 7.2 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. అయితే దీన్ని ఆ తరువాత 6.9 మాగ్నిట్యూడ్ కు తగ్గించింది. భారీ భూకంపం సంభవించడంతో జపాన్ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. తైవాన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. యూలీ పట్టణంలో ఓ భవనం కూలిపోయిందని వెల్లడించింది. భూకంప ప్రభావంతో భూమి కంపించడంతో జనాలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగుతు తీశారు. తైవాన్ రాజధాని తైపీలో కూడా భూకంప ప్రభావం కనిపించింది.
శనివారం కూడా అదే ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ఆదివారం వచ్చిన భూకంపం మరింత బలంగా ఉంది. జపాన్ వాతావరణ సంస్థ తైవాన్ కు సమీపంలో ఉన్న మారుమూల దీవులకు సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఒక మీటర్ ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ప్రభావిత ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఎతైన అలల ప్రభావం కనిపించలేదు. తైవాన్, జపాన్ తో పాటు చైనాలోని పుజియాన్, గ్వాంగ్ డాంగ్, జియాంగ్సు, షాంఘై తీర ప్రాంతాల్లో ప్రకంపన ప్రభావం కనిపించింది.
Read Also: Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన బస్సు, 27 మంది మృతి
తైవాన్, జపాన్ ప్రాంతాలు పసిఫిక్ ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలో ఉన్నాయి. దీంతో ఇక్కడ భూమి అడుగులో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సముద్రం అడుగులో ఒక ప్లేట్ తో మరో ప్లేట్ గట్టిగా నెట్టివేయడంతో అపరిమిత శక్తితో భూకంపాలు ఏర్పడుతుంటాయి. గతంలో జపాన్ లో వచ్చిన సునామీ కూడా ఈ కారణంగానే వచ్చింది. ఈ అపరిమితమైన శక్తి సముద్ర అలలు పెద్ద ఎత్తున వచ్చేలా చేసి సునామీలకు కారణం అవుతుంటాయి. తైవాన్ లో ఇప్పటి వరకు 1997లో అత్యంత ఘోరమైన భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 2400 మంది చనిపోయారు.