హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేసింది ఇండియన్ ఓషియన్ సునామీ వార్నింగ్ మెటిగేషన్ సిస్టమ్ (ఐఓఎస్ డబ్ల్యూఎంఎస్). ఇండోనేషియా సమీపంలోని తూర్పు తైమూర్ దేశంలో శుక్రవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం సునామీ ప్రమాదాన్ని తీసుకురావచ్చని అంచాన వేసింది. తూర్పు తైమూర్ ఇండోనిషియా మధ్య తైమూర్ ద్వీపం నుంచి 51.4 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
ఇండోనేషియా దాని పరిసర దేశాలు ‘పసిఫిక్ రిమ్’ అనే ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. మహాసముద్రం అంచున టెక్టానిక్స్ ప్లేట్ల కదలిక నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దీంతో పాటు సముద్రాల్లో ఉండే అగ్నిపర్వతాలు బద్ధలు అవుతుండటంతో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేషియాలో భూకంప కారణంగా 6గురు చనిపోయారు.
2004లో సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో సునామీ వచ్చింది. ఈ విపత్తులో ఇండోనేషియాలోని 1,70,000 మంది చనిపోయారు.దీంతో పాటు ఇండియా, శ్రీలంక దేశాలపై సునామీ తీవ్ర ప్రభావం చూపింది. ఈ సునామీ కారణంగా ప్రపంచంలో మొత్తం 2,20,000 మంది మరణించారు. ఇండియా తూర్పు తీర ప్రాంతంలోని చెన్నై, విశాఖ వంటి పట్టణాల్లో సునామీ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కన్యాకుమారి, కోరమండల్, ఆంధ్రా, ఉత్కల్ తీరాలకు సమీపంలో ఉన్న గ్రామాలు పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం వాటిల్లింది.