నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఇంటర్నెట్ బంద్ అయింది. నగరాల్లో కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఇక టెహ్రాన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హింస తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులు వాహనాలు, ఆస్తులు తగలబెట్టారు. అల్-రసూల్ మసీదును లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు నిప్పుపెట్టారు. దీంతో సైన్యం కాల్పులకు తెగబడింది. ఆందోళనల్లో ఇప్పటివరకు 217 మంది నిరసనకారులు మరణించారని ఒక ఇరానియన్ వైద్యుడు టైమ్ మ్యాగజైన్‌కు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Trump-Greenland: గ్రీన్‌లాండ్ కావాలంటే ఇలా చేయండి.. వైరల్‌గా మారిన ట్రంప్‌కు కొత్త ప్రతిపాదన
ప్రస్తుతం ఇంటర్నెట్ పని చేయకపోవడం… ఇంకోవైపు ఫోన్ కనెక్షన్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఒకరితో ఒకరు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇక నిరసనకారుల శవాలు వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా యువకులే ఉన్నారు. దీంతో పిల్లల్ని నిరసనల్లోకి పంపించొద్దని తల్లిదండ్రులకు టెహ్రాన్ ప్రాసిక్యూటర్ హెచ్చరించారు.
ట్రంప్ వార్నింగ్..
ఇదిలా ఉంటే ఇరాన్ సైన్యం కాల్పుల్లో నిరసనకారులు చనిపోవడంతో ట్రంప్ మరోసారి తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. నిరసనకారులపై కాల్పులు జరిపితే ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సూచించారు.
నిరసనలకు కారణం ఇదే..
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చాలా సంవత్సరాలుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి తోడుగా అణు కార్యక్రమంతో ముడిపడి ఉన్న అమెరికా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయి. గత జూన్‌లో ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధంతో సహా ప్రాంతీయ ఉద్రిక్తతలతో ఆ ఒత్తిడి మరింత తీవ్రమయ్యాయి. దీంతో రాష్ట్ర వనరులన్నీ హరించుకుపోయాయి.
ఇక ఇటీవల కాలంలో ఇరానీ కరెన్సీ భారీగా పడిపోయింది. 2025లో అమెరికా డాలర్‌తో పోలిస్తే దాని విలువు దాదాపు సగానికి పడిపోయింది. అధికారిక గణాంకాలు ప్రకారం డిసెంబర్‌లోనే ద్రవ్యోల్బణం 42 శాతానికి మించిపోయింది. ముఖ్యంగా విదేశీ దిగుమతులపై ఆధారపడిన వ్యాపారాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇంకోవైపు పెరుగుతున్న ధరలతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. దీంతో ఆర్థిక సంక్షోభంతో కుటుంబాలు విలవిలాడుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. తొలుత వ్యాపారులు నిరసనలకు దిగగా.. అనంతరం నెమ్మది నెమ్మదిగా విశ్వవిద్యాలయాలు… నగరాలకు నిరసనలు వ్యాప్తి చెంది తీవ్ర రూపం దాల్చాయి. ప్రస్తుతం పూర్తిగా పరిస్థితులు చేదాటిపోయాయి.