ఇరాన్‌లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. టెహ్రాన్‌లో పరిపాలనా భవనం దగ్గరకు నిరసనకారులు రావడంతో భద్రతా దళాలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 16 మంది ఆందోళనకారులు మృతిచెందారు. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమేనీకి ట్రంప్ తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నిరసనకారులు చనిపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జనవరి 5, 2026న ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: అంతర్జాతీయ సంక్షోభం.. మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఇరాన్‌లోని నిరసనలను నిశితంగా గమనిస్తున్నామని.. ఇలానే నిరసనకారులను చంపుకుంటూ పోతే మాత్రం ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. చాలా బలమైన ప్రతిస్పందన ఉంటుందని తేల్చిచెప్పారు. గత శుక్రవారం కూడా ఇదే మాదిరిగా ట్రంప్ హెచ్చరించారు. నిరసనకారులపై జులుం ప్రదర్శిస్తే అమెరికా జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. తాజాగా మరోసారి తీవ్ర వార్నింగ్‌లు ఇచ్చారు.
ఇరాన్ స్పందన..
అమెరికా, ఇజ్రాయెల్ వార్నింగ్‌లపై ఖమేనీ సీనియర్ సలహాదారు అలీ లారిజాని సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘ఇజ్రాయెల్, ట్రంప్ ప్రకటనలు వెనుక ఏం జరుగుతుందో స్పష్టం చేస్తున్నాయి. నిజమైన నిరసనకాలు-విధ్వంసక శక్తుల మధ్య మేము స్పష్టమైన వ్యత్యాసాన్ని గుర్తించాం. ఈ దేశం విషయంలో అమెరికా జోక్యం ఈ ప్రాంతం మొత్తాన్ని అస్థిరపరుస్తుంది. అంతేకాకుండా అమెరికా ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది. వారు తమ సైనికుల భద్రతను జాగ్రత్తగా చూసుకోవాలి.’’ అని పేర్కొన్నారు.
ఇటీవల ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా.. ఖమేనీ తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండు వారాల నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో భద్రతా దళాలు కాల్పులకు తెగబడడంతో 16 మంది నిరసనకారులు చనిపోయారు. అయితే ఈ నిరసనల వెనుక ఇజ్రాయెల్, అమెరికా ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది.
ఇది కూడా చదవండి: Trump: నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు.. రష్యా చమురుపై ట్రంప్ వ్యాఖ్య