భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. శుక్రవారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో వాణిజ్య చర్చలు గొప్పగా జరుగుతాయని వెల్లడించారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నట్లు చెప్పారు. భారత్-పాకిస్థాన్ ఘర్షణలకు దిగితే వారితో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనే ఆసక్తి పోతుందన్నారు. వాణిజ్య చర్చలు జరిపేందుకు వచ్చే వారం పాకిస్థాన్ ప్రతినిధులు కూడా అమెరికా వస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనను పాకిస్థాన్ కూడా ధృవీకరించింది.
ఇది కూడా చదవండి: Shahid Afridi: “కేరళ కమ్యూనిటీ” ఈవెంట్‌కి అతిథిగా షాహిద్ అఫ్రిది.. ‘‘సిగ్గు లేదు’’ అని నెటిజన్లు ఫైర్..
ఏప్రిల్‌లో ట్రంప్ ఆయా దేశాలపై టారిఫ్‌లు ప్రకటించారు. దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజుల పాటు సుంకాలను నిలిపివేశారు. అయితే భారత్ మాత్రం భిన్నంగా ఆలోచించి.. ప్రతికార సుంకాలకు బదులుగా అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టిసారించింది. ప్రస్తుతం ఆ దిశగానే భారత్ అడుగులు వేస్తోంది. ఇటీవలి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అమెరికా వెళ్లారు. వాణిజ్య చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి వాషింగ్టన్‌కు వెళ్లారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మే 27 నుంచి మే 29 వరకు అమెరికాలో పర్యటించారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం.. అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌతో మిస్రి సమావేశం అయ్యారు. సెప్టెంబరు-అక్టోబరు నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలనే లక్ష్యంతో భారత్ ఉంది.
ఇది కూడా చదవండి: Samyuktha Menon : మలయాళ కుట్టీకి పెరుగుతున్న డిమాండ్..
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అయితే ఇరు దేశాలతో చర్చించానని.. కాల్పుల విరమణకు ఇరు దేశాల అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ఉద్రిక్తతలతో దౌత్య ప్రయత్నాలు దెబ్బతింటాయని.. శాంతే మార్గమని ట్రంప్ పేర్కొ్న్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులుంటే వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కుదరదని ట్రంప్ వ్యాఖ్యానించారు.