తాలిబన్లకు ఆడవాళ్లు అంటే చిన్నచూపు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే రాదు.. పలు సందర్భాల్లో ఆడవాళ్లపై వాళ్ల వైఖరిని బయటపెట్టేస్తూనే ఉంటారు.. అయితే, తాలిబన్ల ప్రభుత్వంలోనూ తమకు ప్రాతినిథ్యం కల్పించాలంటూ మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. కానీ, మహిళలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాలిబన్లు. కేవలం పిల్లలను కనడానికి మాత్రమే కావాలన్నారు. మహిళలు ఎప్పటికీ మంత్రులు కాలేరని… తమ ప్రభుత్వంలో చోటు కల్పించమనన్నారు తాలిబన్లు. ఆయుధాలతో ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. ఆది నుంచి మహిళలనే టార్గెట్ చేశారు. వారి హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు కనడానికి మాత్రమే కావాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన చెందుతున్నారు ఆఫ్ఘన్ మహిళలు.
మరోవైపు.. తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు తాలిబన్లు.. జర్నలిస్టులపై అతి దారుణంగా దాడిచేశారు. కాబూల్ వీధుల్లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళలపై తాలిబన్లు గాలిలో కాల్పులు జరిపారు. ఈ నిరసన కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు అఫ్ఘాన్ జర్నలిస్టులను అతి క్రూరంగా కొట్టారు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టుల ఫొటోలు దారుణంగా ఉన్నాయి. వారి ఒంటి నిండా గాయాలే కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలు చేసి అక్కడి ప్రజలు భయపడుతున్నారు. భవిష్యత్తులో తాలిబన్ల పాలన ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇక, తాజాగా కాబూల్‌లోని నార్వే రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు. ఎంబసీ లోపలున్న వైన్ సీసాలను పగలగొట్టి, పుస్తకాలను ధ్వంసం చేశారు. కాబూల్‌లోని తమ ఎంబసీని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని, ఆ తర్వాత తిరిగి దానిని తమకు అందిస్తామన్నారని నార్వే రాయబారి సిగ్వల్డ్ హాగ్ ట్వీట్ చేశారు. ఎంబసీలోని వైన్ సీసాలను, పిల్లల పుస్తకాలను వారు ధ్వంసం చేశారని తెలిపారు. విదేశీ దౌత్య కార్యాలయాల జోలికి వెళ్లమంటూనే… నార్వే ఎంబసీని స్వాధీనం చేసుకోవడం తాలిబన్ల ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది.