ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌లో ముష్కరులు మారణహోమం సృష్టించారు. యూదులు లక్ష్యంగా ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. పహల్గామ్ ఉగ్ర దాడి తరహాలో సిడ్నీ పర్యాటక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు 15 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో యూదులు భయకంపితులయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు .. ఏకమైన మెయిటీ-కుకి బీజేపీ ఎమ్మెల్యేలు
మారణహోమం సృష్టించిన నిందితులిద్దరూ తండ్రి, కొడుకుగా గుర్తించారు. తండ్రి సాజిత్ అక్రమ్, కొడుకు నవీద్ అక్రమ్‌గా కనిపెట్టారు. నిందితులు పాకిస్థాన్‌కు చెందిన వారని అమెరికా నిఘా అధికారులు వెల్లడించారు. లైసెన్స్ పొందిన తుపాకులతోనే నిందితులిద్దరూ కాల్పులకు తెగబడినట్లుగా గుర్తించారు. ఇది ఉగ్రదాడి అంటూ అధికారికంగా న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ధృవీకరించారు. ఇక పోలీసుల కాల్పుల్లో సాజిత్ అక్రమ్ (50) చనిపోగా.. కొడుకు నవీద్ అక్రమ్ (24) ఆస్పత్రిలో పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.
ఇది కూడా చదవండి: H1b visa: హెచ్1 బీ వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే..!
కాల్పుల్లో తండ్రి, కొడుకు తప్ప మిగతా ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. యూదుల హనుక్కా వేడుకను ( జెరూసలేం ఆలయ పునరుద్ధరణకు గుర్తుగా) లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపినట్లుగా వెల్లడించారు. కాల్పులు జరగగానే యూదులంతా భయాందోళనతో పారిపోయారు. నిందితుడితో సహా మొత్తం 16 మంది చనిపోయినట్లుగా పోలీసులు తెలియజేశారు. సంఘటనాస్థలి నుంచి రెండు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లను (IEDలు) గుర్తించి భద్రపరిచారు. అయితే సంఘటనాస్థలి నుంచి ఐఎస్ఐఎస్ జెండా దొరికినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులైతే అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. దాడి వెనుక ఉన్న ఉద్దేశాలను దర్యాప్తు చేస్తున్నామని.. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో జరిగే అన్ని ప్రార్థనా కార్యక్రమాల్లో పోలీసుల బందోబస్తును పెంచుతామని స్పష్టం చేశారు.